వరద విలయం

– నిన్న మోరంచపల్లి.. నేడు పోతన నగర్‌
– భద్రకాళి చెరువుకు గండి
– కాలనీలను ముంచెత్తిన వరద
– శాంతించిన మున్నేరు
– గోదావరిలో 55 అడుగులకు చేరిన నీరు
– 30 గేట్ల ద్వారా జూరాలకు నీటి విడుదల
వర్షాలు.. వరదలు తగ్గుముఖం పట్టినా.. అవి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు.. రాత్రి వేళల్లో భారీ వర్షం కురవడం.. ఆ నీటితో చెరువులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించి గ్రామాలను ముంచేశాయి.. ఊహించని పరిణామంతో వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన ప్రజల కన్నీటిని ఎవరూ ఆపలేని పరిస్థితి నెలకొంది. పంట పొలాలు ఇప్పటికీ నీటిలోనే ఉన్నాయి. ఇసుక మేటలతో నిండాయి. వరద తాకిడి తట్టుకోలేక అనేక చోట్ల రహదారులు కోతకు గురికాగా.. వంతెనలు కొట్టుకుపోయాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో చాలా మంది నిరుపేదలు నిరాశ్రయులయ్యారు. ఇప్పుడా కష్టం పోతన నగర్‌ వాసులకు వచ్చింది. చరిత్ర ప్రసిద్ధికెక్కిన కాకతీయుల కాలం నాటి వరంగల్‌ భద్రకాళి చెరువుకు గండి పడింది. కాలనీలను ఆ నీరు చుట్టుముట్టింది. మరోవైపు భద్రాద్రిలో గోదావరి 55.70 అడుగులకు చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రెండ్రోజులు ముంచెత్తిన మున్నేరు వాగు శనివారం శాంతించింది. జూరాల 30 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
నవతెలంగాణ-మట్టెవాడ/భూపాలపల్లి/విలేకరులు
వరంగల్‌ భద్రకాళి చెరువు మట్టకట్ట శనివారం కోతకు గురై తెగిపోవడంతో నీరు పోతన నగర్‌ వాసుల ఇండ్లను ముంచెత్తింది. మూడ్రోజుల కిందట వచ్చిన వరదలతో పునరావాస కేంద్రాల్లో తలదాచు కొని సర్వం కోల్పోయిన పోతననగర్‌ వాసులు శని వారమే ఇండ్లలోకి చేరారు. వచ్చిన కొద్దిసేపటిలోనే భద్రకాళి చెరువు కట్ట తెగడంతో ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. ఉన్న సామాను కూడా కొట్టు కుపోయిందని కన్నీరు మున్నీరయ్యారు.
గతంలో ఎప్పుడూ కట్ట తెగిన దాఖలాలు లేవు. కానీ, ఇరిగేషన్‌ అధికారుల నిర్లక్ష్యం, కూడా, మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ అధికారుల వైఫల్యం కారణంగా మట్టికట్ట కోతకు గురై పోతన నగర్‌ను ముంచేసింది. భారీగా వరద వచ్చినప్పుడే కట్ట మీదుగా నీరు వస్తోందని, మట్టికట్ట కోతకు గురి అవుతుందని స్థానికులు అధికారులకు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో ఇప్పుడీ పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొంది వాగు ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు షట్టర్లు ఎత్తి నీటిని వాగు పక్కనే ఉన్న భద్రకాళి చెరువులోకి వదిలారు. దీంతో వరద ఉధృతి పెరిగి ఒక్కసారిగా మట్టి కట్ట కోతకు గురైంది. గండి పూడ్చివేతకు మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌రావు, ఛీప్‌ విప్‌ వినరుభాస్కర్‌, అధికారులు చర్యలు తీసుకున్నారు.
బురదలో మోరంచపల్లి
మోరంచపల్లి గ్రామంలో ఇండ్లన్నీ బురదతో నిండాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తడిసి ముద్దయ్యాయి. విలువైన వస్తువులు కొట్టుకు పోయాయి. కట్టు బట్టలు.. మొండిగోడల ఇండ్లు తప్ప వారికి మరేం మిగలలేదు. వరద బాధితుల నిమిత్తం జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యవేక్షణలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. వరదల్లో గల్లంతైన నలుగురిని పోలీసులు డ్రోన్‌ కెమెరాల ద్వారా వెతకడంతో శనివారం గొర్రె ఒదిరెడ్డి, గొంగడి సరోజన మృతదేహాలు లభ్యమ య్యాయి. ఇంకా గడ్డం మహాలక్ష్మీ, గంగిడి వజ్రమణి కోసం జిల్లా పోలీసులు, ఎన్‌డీ ఆర్‌ఎఫ్‌ బృందాలు చర్యలు చేపడుతున్నాయి. మోరంచ పరివాహక ప్రాంతంలో సుమారు 950 ఎకరాల పంట భూముల్లో ఇసుక మేటలు ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. మోరంచపల్లి గ్రామంలో 250 ఎకరాల్లో ఇసుక మేటలు గుర్తించారు.
గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి వరద రాత్రి 7 గంటలకు 55.70 అడుగులకు చేరుకుంది. 15,642,50 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఖమ్మం నగరంలో రెండ్రోజులు ఉగ్రరూపం దాల్చి ప్రవహించిన మున్నేరు వాగు శనివారం శాంతించింది. కానీ తీరని నష్టాన్ని మిగిల్చింది. మున్నేరు ముంపు పరివాహక ప్రాంతాల్లోని ఇండ్లల్లో బురద చేరింది. గ్రామ పంచాయతీ సిబ్బంది జేసీబీ, వాటర్‌ ట్యాంకర్ల సహాయంతో రోడ్లు శుభ్రం చేశారు.
ప్రజాప్రతినిధులు పరిశీలన
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే పొదెం వీరయ్య భద్రాచలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. కరకట్ట పరిసరాలను పరిశీలించారు. బూర్గంపాడులో పునరావాస కేంద్రాన్ని సందర్శించి వారికి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్‌ కవిత, ఎమ్మెల్యే, విప్‌ రేగా కాంతారావు బూర్గంపాడు, అశ్వాపురం, భద్రాచలం ముంపు ప్రాంతాల్లో పర్యటించి, పునరా వాస కేంద్రాల్లో బాధితులను కలిశారు.
నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని సిరాల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఇలేగాంలోని పంటపొలాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పరిశీలిం చారు. బాధితులకు నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ డెవల ప్‌మెంట్‌ కమిటీ చైర్మెన్‌ సముద్రాల వేణుగోపాల చారి పంటలను, చెరువు తెగిన ప్రాంతాన్ని పరిశీ లించారు.
ఖమ్మం నగరంలోని 35, 48వ డివిజన్‌లో బాధితులను మంత్రి పువ్వాడ అజరుకుమార్‌, ఎంపీ లు పరామర్శించారు. ఖమ్మం రూరల్‌ మండలం జలగం నగర్‌లో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పర్యటించారు. మోతీనగర్‌, బొక్కల గడ్డలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించి పలువురి ని ఓదార్చారు. నిత్యావసరాలు పంపిణీ చేశారు.
సీపీఐ(ఎం) బృందం పర్యటన
భద్రాచలం పట్టణంలోని డిగ్రీ కాలేజీ, నన్నపనేని స్కూల్‌ పునరావాస కేంద్రాలను, సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌, విస్తా కాంప్లెక్స్‌ స్లూయిజ్‌ తదితర ముంపు ప్రాంతాలను సీపీఐ(ఎం) బృందం పరిశీలించింది. వరద బాధితులకు ప్రభుత్వం రూ.25వేల నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ(ఎం) నేతలు సహాయక కార్యక్ర మాల్లో పాల్గొంటున్నారు. ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని కోరుతున్నారు.
జూరాల 30 గేట్లు ఎత్తివేత
నవతెలంగాణ- ధరూరు
జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్‌ మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 30 గేట్లను శనివారం అధికారులు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం వస్తోంది. జూరాలకు ఎగువ ప్రాంతం నుంచి 1,90, వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రస్తుత నీటిమట్టం 1041.273 అడుగులు ఉందని పీజేపీ అధికా రులు తెలిపారు. ఎగువ, దిగువ జూరాల నుంచి 6 యూనిట్స్‌ విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. జల విద్యుత్‌ కేంద్రం ద్వారా 28వేల క్యూసెక్కుల నీరును వదులుతు న్నారు. నెట్టెంపాడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ద్వారా, బీమా ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు.

Spread the love