నవతెలంగాణ-హైదరాబాద్: ఎడాతెరిపి లేకుండా చైనాలో భారీ వర్షాలు కురిస్తున్నాయి. బీజింగ్ తోపాటు ఆదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వరద ఇళ్లల్లోకి ప్రవేశించింది. దాదాపు ఇప్పటివరకు 34 మంది చనిపోయారని అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన సహాయ బృందాలు 80 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాణనష్టాన్ని తగ్గించాలని అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారులకు ఆదేశించారు.
మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ ఎత్తున వర్షాలు కురిశాయి. బీజింగ్‌లో సగటున 16 సెంటీమీటర్ల (6 అంగుళాలు) కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, మియున్‌లోని రెండు పట్టణాల్లో 54 సెంటీమీటర్ల (21 అంగుళాలు) వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. మియున్‌లో 1959లో నిర్మించిన రిజర్వాయర్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. నదుల నీటి మట్టాలు పెరగడం, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
చెట్లు కూలిపోయాయి. విద్యుత్తు స్తంభాలు విరిగిపోవడంతో పలు ప్రాంతాలు చీకటిమయమయ్యాయి. ఇక కార్లు, బైక్‌లు వరదల్లో కొట్టుకుపోయాయి. మియున్ జిల్లాలో అర్ధరాత్రి నాటికి 28 మంది మరణించగా.. యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు మరణించారని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది. మియున్‌లో దాదాపు 17,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. పొరుగున ఉన్న హెబీ ప్రావిన్స్‌లోని లువాన్‌పింగ్ కౌంటీలోని గ్రామీణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారని తెలిపాయి . మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. కమ్యూనికేషన్లు నిలిచిపోయాయని, బంధువులను సంప్రదించలేకపోతున్నట్లు ఒక బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.