– భద్రాచలం వద్ద 41.30 అడుగులకు చేరిన నీటిమట్టం
– పునరావాస కేంద్రాలకు ముంపు గ్రామాల ప్రజలు
అమరావతి : ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గోదావరి ఉధృతి పెరిగింది. దీంతో, పోలవరం ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నారు. భద్రాచలం వద్ద శనివారం ఉదయం 41.30 అడుగులకు చేరిన నీటిమట్టం రాత్రి ఏడు గంటల వరకు నిలకడగా కొనసాగింది. దాదాపు ఏడు గంటల పాటు వరద నిలకడగా కొనసాగడంతో 18 గంటల అనంతరం ఆ ప్రభావం దిగువన ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కనిపిస్తోంది. ఆదివారం వరద తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున తూర్పుగోదావరి జిల్లా సీతానగరం, తాళ్లపూడి, కడియం మండలాల్లోని లోతట్టు ప్రాంత లంక భూములకు ముంపు ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.70 అడుగులకు చేరింది. సీలేరు జలాలతో కలిపి ఎగువ ప్రాంతాల నుంచి 5,43,409 క్యూసెక్కుల వరద నీరు గోదావరిలో చేరుతోంది. ఆదివారం ఉదయానికి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద ఉధృతి అధికమవుతుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేశారు. తొమ్మిది లక్షల నుంచి పది లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద పది లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
స్తంభించిన రాకపోకలు
ఏలూరు జిల్లా దాచారం, కుక్కునూరు మధ్య గుండేటి వాగు కాజ్‌వేపైకి వరద నీరు చేరడంతో వాగు అవతల ఉన్న 12 గిరిజన గ్రామాలకు రాకపోకలు రెండు రోజులుగా స్తంభించాయి. వరద ఉధృతి పెరుగుతుండడంతో గొమ్ముగూడెంలోని 253 కుటుంబాలకుగానూ వంద కుటుంబాలు రావికుంట పునరావాస కేంద్రానికి తరలివెళ్లాయి. గొమ్ముగూడెం, దాచారంలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని శనివారం జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి పర్యవేక్షించారు. వేలేరుపాడు మండలం రుద్రమకోట, రేపాకగొమ్ము, తాట్కూర్‌గొమ్ము గ్రామాల్లోని సుమారు 50 కుటుంబాలు ముందు జాగ్రత్తగా తమ సామగ్రితో భూదేవిపేట, అశ్వారావుపేట, ఆసుపాక, నెమలిపేట ఆర్ అండ్ ఆర్ కాలనీలకు తరలిపోయాయి. సహాయ, పునరావాస కార్యక్రమాలను జంగారెడ్డిగూడెం ఆర్‌డీఓ ఎంవి.రమణ, డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్.విజయరాజు పర్యవేక్షించారు. అనంతరం వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ రమణ అధికారులతో సమావేశం నిర్వహించారు. పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. వరద పునరావాస శిబిరాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలోకి చేరుకున్న 7,43,222 క్యూసెక్కుల అదనపు జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు స్పిల్‌వే ఎగువన 31.430 మీటర్లు, దిగువన 22.600 మీటర్లు, ఎగువ కాఫర్ డ్యామ్ ఎగువన 31.900 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ దిగువన 22,050 మీటర్లు, ఎగువ దిగువ కాఫర్ డ్యాం మధ్య 16.080 మీటర్లు, ప్రాజెక్టు దిగువన 10.78 మీటర్లు నీటిమట్టం నమోదైందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పట్టిసీమ శివక్షేత్రాన్ని వరద జలాలు చుట్టుముట్టాయి.
గోదావరికి వరద ఉధృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES