నవతెలంగాణ-హైదరాబాద్: సెంట్రల్ వియత్నాంలో ఈ వారాంతం నుండి కురిసిన కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో మృతి చెందారు. మృతుల సంఖ్య 16కి చేరిందని గురువారం ప్రభుత్వ నివేదిక తెలిపింది. ఈ పరిస్థితుల్లో ముంపునకు గురైన గ్రామాలు, నగరాల్ని వరదనీరు ముంచెత్తింది. గత మూడు రోజుల్లో మధ్య వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో 1,500 మిల్లీమీటర్ల వర్షపాతం దాటింది. ఈ ప్రాంతం కాఫీ తోటలకు ప్రసిద్ధి. కాఫీ ఉత్పత్తులతోపాటు, పలు బీచ్‌ల నిలయం. కానీ తరచూ తుఫానులు, వరదలకు ఎక్కువగా ప్రభావితమవుతుంది.
కాగా, ఈ వరదలు, కొండచరియలు విరిగిపడడం వల్ల ఐదుగురు గల్లంతయ్యారు. 43 వేల ఇళ్లు, పదివేల హెక్టార్లకు పైగా పంట నీట మునిగిపోయాయి అని ప్రభుత్వ విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక తెలిపింది. వరదల కారణంగా విద్యుత్ గ్రిడ్‌లు దెబ్బతిన్న తర్వాత 553,000 కంటే ఎక్కువ గృహాలు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు ప్రభుత్వం తెలిపింది.



