– త్వరలో ప్రారంభం ట్రాఫిక్ కష్టాలకు చెల్లు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు త్వరలో ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) నుంచి కొండాపూర్‌కు వెళ్లే అత్యాధునిక మల్టీ-లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జూన్ మొదటి వారంలో ప్రారంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. దీంతో ప్రయాణ సమయం సైతం ఆదా కానుంది.
ప్రాజెక్టు వివరాలు
ఈ ఫ్లైఓవర్‌ను రూ.178 కోట్ల వ్యయంతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద నిర్మించారు. 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో ఇది అందుబాటులోకి రానుంది. ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై నిర్మించిన మూడవ స్థాయి నిర్మాణం కావడం దీని ప్రత్యేకత. గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్, దానిపై శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్ ఉండగా, ఇప్పుడు దానికిపై ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించారు.
తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు
గచ్చిబౌలి జంక్షన్ వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఈ ఫ్లైఓవర్‌తో తగ్గనుంది. ఓఆర్‌ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్‌పేట్ మార్గాల్లో వెళ్లే వాహనాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుంది. ప్రయాణ సమయం ఆదాతోపాటు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. కొండాపూర్ ప్రాంతం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, అక్కడి నుంచి కొండాపూర్ ప్రాంతాలకు వెళ్ళేందుకు గచ్చిబౌలి వద్ద ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లే వెసులుబాటు ఉంది.
జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేశారు. గతంలో కొన్ని కారణాల వల్ల ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం పనులు తుది దశలో ఉన్నాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి, త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం హైదరాబాద్ మౌలిక సదుపాయాల అభివద్ధిలో మరో ముందడుగు కానుంది. ఫ్లైఓవర్‌ను వేగవంతంగా పూర్తి చేసేందుకు కమిషనర్ ఆర్.వి.కర్ణన్ పలుమార్లు పర్యటించి ప్రాజెక్టు ఇంజినీర్లను ఆదేశించారు.
ఎస్‌ఆర్‌డీపీ ద్వారా హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ద్వారా 23వ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. దీంతో నగరంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేరుగా నిర్దేశించిన సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. సీఆర్‌ఎంపీ ద్వారా, ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన పనులు పూర్తి కావడంతో గతంలో కంటే అధిక వేగంగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపట్టిన మొత్తం 42 పనులలో ఈ ఫ్లైఓవర్‌తో 37 పనులు పూర్తయ్యాయి. ఫలక్‌నూమా రైల్వే ఓవర్ బ్రిడ్జి ,శాస్త్రిపురం ఆర్‌వోబీ పనులు రైల్వే పోర్షన్ రెండు మూడునెలల్లో పూర్తి చేయాలని కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ రైల్వే అధికారులకు సూచించారు. వారికి జులై నెల చివరి వరకు ఫలక్‌నూమా ఆర్‌వోబీ, ఆగస్టు నెల చివరి వరకు శాస్త్రిపురం ఆర్‌వోబీ పనులను పూర్తిచేయాలని కమిషనర్ టార్గెట్ పెట్టారు. ఈ రెండు ఆర్‌వోబీలు పూర్తయితే ఎస్‌ఆర్‌డీపీ పనులు 39 వరకు పూర్తవుతాయి. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనదారులు ప్రయాణించవచ్చు.
హెచ్ సిటీ ద్వారా రూ. 7032 కోట్లతో 58 పనులు
ఇదిలావుండగా ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రావడం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. గతంలో జీహెచ్‌ఎంసీకి ఇచ్చిన హామీ మేరకు నగర అభివద్ధికి నిధులను మంజూరు చేసి జీహెచ్‌ఎంసీకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. నగర అభివద్ధికి హెచ్‌సిటీ ద్వారా రూ. 7032 కోట్ల వ్యయంతో 58 పనులు చేపట్టనున్నారు. అందులో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, నాలుగు ఆర్‌వోబీలు, మూడు రైల్వే అండర్ బ్రిడ్జిలు, రోడ్డు వెడల్పు 10 పనులను చేపట్టేందుకు ప్రతిపాదించారు. ఈ పనులు టెండర్ దశ పూర్తిచేసి అగ్రిమెంట్ దశకు చేరాయి. ఈ పనుల్లో కొన్ని జూన్ మాసంలో ప్రారంభం కానున్నాయి.