నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి NH65పై హయత్ నగర్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అంగీకరించారు. మూడు నెలల్లో FOB నిర్మాణం పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైవేపై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న కారణంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని మంగళవారం స్థానికులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో మంత్రి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి హయత్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ప్రజలు రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చే వాహనాలు ఢీకొనడంతో ప్రమాదాలు చోటుచేసుకుని చాలా మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాతీయ రహదారిపై మంగళవారం స్థానికులు ధర్నా చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇక్కడ నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జాతీయ రహదారా.. మృత్యు మార్గమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల రోడ్డు దాటుతుండగా ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి చెందగా.. ప్రజల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. దీంతో హైవేకు ఇరువైపులా ఉన్న కాలనీలవాసులు ఆందోళన చేపట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. వారికి నచ్చచెప్పి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఈ విషయం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. హయత్‌నగర్‌లోని లెక్చరర్స్ కాలనీ వద్ద ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మూడు నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హయత్ నగర్ వద్ద యజమానుల మొండితనం, కోర్టు స్టేతో రోడ్డు విస్తరణకు ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే ఊరుకోమని.. బందోబస్తు మధ్య పనులు పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.



