Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeఆటలుఫుట్‌బాల్‌ పయనమెటో?

ఫుట్‌బాల్‌ పయనమెటో?

- Advertisement -

– సందిగ్ధంలో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌
– వేతనాలు కోల్పోతున్న ఆటగాళ్లు, సిబ్బంది

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) భారత ఫుట్‌బాల్‌కు ఓ వెలుగు రేఖను చూపించిన ప్రాంఛైజీ లీగ్‌. క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు, స్పాన్సర్‌షిప్‌ ఒడిదొడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఐఎస్‌ఎల్‌ నిలబడింది. విదేశీ ఆటగాళ్లు, విదేశీ కోచ్‌లతో కలిసి భారత ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు డ్రెస్సింగ్‌రూమ్‌ పంచుకోవటం ఎంతో కలిసొచ్చింది. అయితే, ఫుట్‌బాల్‌ సమాఖ్య అంతర్గత వివాదం ఇప్పుడు ఐఎస్‌ఎల్‌ భవిష్యత్‌ను అంధకారంలో పడేసింది.
నవతెలంగాణ క్రీడావిభాగం : ‘దొడ్లో దున్నపోతు ఈనింది అంటే.. వంట గదిలోకి వెళ్లి వెండి గిన్నె తీసుకురా.. జున్ను పాలు పితుక్కుందామన్న’ చందంగా తయారైంది ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ (ఏఐఎఫ్‌ఎఫ్‌) నిర్వాహకం. ఓ వైపు భారత ఫుట్‌బాల్‌ భవిష్యత్‌ అయోమయంలో పడుతుండగా… మరోవైపు ఏఐఎఫ్‌ఎఫ్‌ విజన్‌ 2046 డాక్యుమెంట్ల పేరిట… అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తోంది. ఇండియన్‌ సాకర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఎంఆర్‌ఏ (మాస్టర్‌ రైట్‌ అగ్రీమెంట్‌) ఒప్పందం ఈ ఏడాది ముగుస్తుందని తెలిసినా.. ఒప్పందం పునరుద్ధరణకు ఏమాత్రం చొరవ తీసుకోలేదు. ఆలస్యంగానైనా మేల్కోని ఏఐఎఫ్‌ఎఫ్‌ అలసత్వానికి ఇప్పుడు భారత ఫుట్‌బాల్‌ భారీ మూల్యం చెల్లిస్తోంది. ఐఎస్‌ఎల్‌ సీజన్‌ 12పై నీలనీడలు కమ్ముకోవటంతో బెంగళూర్‌ ఎఫ్‌సీ, ఒడిశా ఎఫ్‌సీ, చెన్నయిన్‌ ఎఫ్‌సీలు ఆటగాళ్లు, సిబ్బంది వేతనాలను నిలిపివేశారు. ఐఎస్‌ఎల్‌లో 14 క్లబ్‌లు ఫుట్‌బాల్‌ కార్యకలాపాలపై ఇది నేరుగా ప్రభావం చూపుతోంది. అంధకారంలో కూరుకున్న భారత ఫుట్‌బాల్‌ సీజన్‌ను.. సూపర్‌ కప్‌తో మొదలెట్టాలని భావిస్తున్నా అందుకు ఎన్ని క్లబ్‌లు అంగీకారం తెలుపుతాయో లేదో తెలియటం లేదు.
తెరపైకి సూపర్‌ కప్‌
భారత ఫుట్‌బాల్‌లో నెలకొన్న అనిశ్చితి వాతావరణానికి తాత్కాలికంగా బ్రేక్‌ వేసేందుకు ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ సిద్ధమైంది. ఇటీవల న్యూఢిల్లీలో ఐఎస్‌లు ప్రాంఛైజీలు, ఎఫ్‌ఎస్‌డిఎల్‌ ప్రతినిధులతో ఏఐఎఫ్‌ఎఫ్‌ సమావేశమైంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఐఎస్‌ఎల్‌ ఎంఆర్‌ఏపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేవు. అలాగని ఐఎస్‌ఎల్‌ సీజన్‌ 12ను ఆరంభించడానికి అవకాశం లేదు. దీంతో క్లబ్‌ల ఫుట్‌బాల్‌ కార్యకలాపాలు కొనసాగించేందుకు అనువుగా మందుగా సూపర్‌ కప్‌ను నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా సూపర్‌ కప్‌ ఐఎస్‌ఎల్‌ లీగ్‌ ముగిసిన తర్వాత జరుగుతుంది. కానీ ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల కారణంగా సూపర్‌ కప్‌తోనే సీజన్‌ను మొదలు కానుంది. ఈ సమావేశానికి ఒడిశా ఎఫ్‌సీ, ఈస్ట్‌ బెంగాల్‌, ఏటికె మోహన్‌ బగాన్‌ ఎఫ్‌సీలు వర్చువల్‌గా హాజరు కాగా.. మిగతా 11 క్లబ్‌ల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.
ఒప్పందుకు ఎందుకు ఆగిందంటే..
ఏఐఎఫ్‌ఎఫ్‌, ఎఫ్‌ఎస్‌డిఎల్‌ మధ్య కుదిరిన పదేండ్ల ఎంఆర్‌ఏ (మాస్టర్‌ రైట్స్‌ అగ్రీమెంట్‌) ఈ ఏడాది డిసెంబర్‌లో ముగుస్తుంది. దీంతో రెండు పక్షాలు మరోసారి ఎంఆర్‌ఏ ఒప్పందం చేసుకోవాలి. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ యాజమాన్య హక్కులపై ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌, ప్రాంఛైజీలు సహా ఎఫ్‌ఎస్‌డిఎల్‌కు ఉండేలా నూతన ఎంఆర్‌ఏ ఒప్పందం ఉండాలని ఫెడరేషన్‌ భావించింది. అందుకు ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘సంప్రదింపుల కమిటీ’ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నూతన ఎంఆర్‌ఏపై ఎఫ్‌ఎస్‌డిల్‌ ప్రతినిధులతో చర్చలు జరిపి ఆ నివేదికను సమాఖ్యను సమర్పించాలి. కానీ, అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య నూతన రాజ్యాంగంపై సుప్రీంకోర్టులో ఓ పిటిషను దాఖలైంది. ఏఐఎఫ్‌ఎఫ్‌ రాజ్యాంగంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఐఎస్‌ఎల్‌ ఎంఆర్‌ఏపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఎందుకంటే, తుది తీర్పుపై ఏఐఎఫ్‌ఎఫ్‌ ఎన్నికలు ఆధారపడి ఉన్నాయి. మళ్లీ ఎన్నికలు జరగాల్సి వస్తే… ఎంఆర్‌ఏ సైతం నూతనంగా ఎన్నికైన కమిటీతోనే కుదుర్చుకోవాలని ఆ ఆదేశం సారాంశం. దీంతో ఐఎస్‌ఎల్‌ ఎంఆర్‌ఏ అర్థాంతరంగా ఆగిపోయింది.
అయోమయంలో క్లబ్‌లు
ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ సాధారణంగా సెప్టెంబర్‌ ఆఖర్లో ఆరంభం అవుతుంది. 14 ప్రాంఛైజీల లీగ్‌ డిసెంబర్‌ నాటికి సీజన్‌ మధ్యలోకి ప్రవేశిస్తుంది. అదే సమయానికి లీగ్‌ ఎంఆర్‌ఏ ఒప్పందం ముగుస్తుంది. సీజన్‌ మధ్యలో ఒప్పందం ముగియటం, లీగ్‌ అర్థాంతరంగా ఆగటం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. అందుకే ఈ ఏడాది ఐఎస్‌ఎల్‌ షెడ్యూల్‌ను వెల్లడించలేదు. ఫలితంగా, ఈ ఏడాది లీగ్‌ ఉంటుందో? ఉండదో అనే అయోమయంలో క్లబ్‌లు ఉన్నాయి. ఏఐఎఫ్‌ఎఫ్‌ రాజ్యాంగం సుప్రీంకోర్టు తీర్పు అనంతరమే ఐఎస్‌ఎల్‌ ఎంఆర్‌ఏపై ఓ స్పష్టత వచ్చే వీలుంది. దీంతో ఈ సీజన్‌ ఐఎస్‌ఎల్‌ను మరిచిపోవాల్సిందేనా? అని క్లబ్‌లు, ఆటగాళ్లు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img