నవతెలంగాణ – హైదరాబాద్: కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్(101) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన కాసేపటి క్రి తుదిశ్వాస విడిచారు. ఆయన 2006 నుంచి 2011 వరకు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

బాల్యంలో పేదరికం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే చదువు ఆపేసి… దర్జీ దుకాణంలో, కొబ్బరి పీచు ఫ్యాక్టరీల్లో పనిచేస్తూ…పొట్టగడుపుకున్న అచ్యుతానందన్ కార్మిక ఉద్యమంలో అడుగుపెట్టారు. 1940లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. స్వాతంత్య్రానికి ముందున్న ట్రావెన్‌కోర్ రాష్ట్రంలో భూస్వాములపై పోరాటంలో భాగంగా జైలుకెళ్లటంతో ఆరంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం అంచలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిస్థాయికి చేరింది. 1964లో సీపీఐ జాతీయ కౌన్సిల్‌ను వదిలేసి… సీపీఎం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 1967 నుంచి 2016 దాకా కేరళ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఒకసారి (2006-2011) ముఖ్యమంత్రిగా, మూడుసార్లు విపక్షనేతగా వ్యవహరించారు. రాష్ట్రంలో భూ ఆక్రమణదారులపైనా ముఖ్యమంత్రిగా ఉక్కుపాదం మోపారు. సాంకేతిక ప్రపంచంలో సాఫ్ట్‌వేర్‌ల రూపంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యం సాగుతోందని ఆయన… అందరికీ అందుబాటులో ఉండే ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ కోసం ఉద్యమించారు. సినిమాల పైరసీ, లాటరీ మాఫియా , అవినీతికి వ్యతిరేకంగా ఆయన తీవ్ర పోరాటం చేశారు.