నవతెలంగాణ వనపర్తి: ప్రజల మధ్యలోకి వెళ్లి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే తనపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం తగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. అలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తండ్రి వయసు ఉన్న వ్యక్తి అని కూడా చూడనంటూ ‘నీ తాటతీస్తా. ఒళ్లు జాగ్రత్త’ అని కవిత ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన జనంబాట కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లాలో పర్యటిస్తున్న ఆమె సోమవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో పదేండ్లలో అభివృద్ధి ఏమీ జరగలేదని.. ఏ చిన్న పిల్లవాడిని కదిలించినా నిరంజన్‌రెడ్డి అవినీతి గురించి చెబుతారన్నారు. ఇంతటి అవినీతిని, ఇలాంటి రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదని విమర్శించారు. వనపర్తిలో ఈయన ఉంటే బీఆర్ఎస్ బతికి బట్టకట్టదని.. ఈ విషయాన్ని మాజీ సీఎం కేసీఆర్ గుర్తించాలన్నారు. దేవుడి మాన్యాలను పెబ్బేరు, వనపర్తిలో నిరంజన్‌రెడ్డి మనుషులు కబ్జా చేసి అమ్ముకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.
అలంపూర్ ప్రాంతంలో తహశీల్దార్ కార్యాలయాన్ని తగులబెట్టిన విషయం కేసీఆర్‌కు తెలియకపోవచ్చని, ఆయనకు తెలియకుండా మాజీ మంత్రి హరీశ్‌రావు కాపాడుతున్నారని పేర్కొన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో కృష్ణానది వద్ద నిరంజన్‌రెడ్డికి చెందిన భూముల్లో ఎసైన్డ్ భూములు ఉన్నాయని ఆరోపించారు. ఆయన అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు.



