నవతెలంగాణ-హైదరాబాద్: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే వున్నం హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్, అనంతపురం ప్రయివేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈయన టీడీపీలో సుదీర్ఘంగా పనిచేశారు. కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి సర్పంచిగా, మండలం పార్టీ అధ్యక్షులుగా, సింగల్ విండో అధ్యక్షులుగా వ్యవహరించారు.
1998 సెప్టెంబర్ 28 నుంచి 2004 మార్చి 28 వరకు మార్ఫెడ్ ఛైర్మన్‌గా, 2000-2010 వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులుగా,టీడీపీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడిగా ఇలా వివిధ హోదాలలో సేవలందించారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో టీడీపీ తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో టీడీపీ టికెట్ దక్కలేదు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. హనుమంతరాయ చౌదరికి వీరేశ్ చౌదరి, మారుతిచౌదరి, ఉదయభాస్కర్ చౌదరి ముగ్గురు సంతానం.



