నవతెలంగాణ-హైదరాబాద్: థాయ్‌లాండ్ మాజీ రాణి సిరికిట్(93) (Queen Sirikit) కన్నుమూశారు. గత కొంత కాలంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అక్టోబర్ 24 శుక్రవారం రాత్రి 9.21 గంటలకు చులాలాంగ్‌కోర్న్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిని థాయ్‌లాండ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రక్త సంక్రమణ (బ్లడ్ ఇన్ఫెక్షన్) కారణంగా ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందని అధికారులు తెలిపారు. వైద్య బృందం తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి మరింత దిగజారడం తో ఆమె తన చివరి శ్వాస విడిచింది. 1932 ఆగస్టు 12న జన్మించిన సిరికిట్ 18 ఏళ్ల వయసులో చక్రి వంశానికి చెందిన భూమిబోల్ అదుల్యాదేజ్‌ను వివాహం చేసుకున్నారు.
ఆమె ప్రపంచంలోనే అత్యంత కాలం సేవలందించిన రాణి గా పేరు పొందారు. 2016లో భర్త భూమిబోల్ మరణం తర్వాత వారి కుమారుడు మహా వజిరాలొంగ్‌కోర్న్ రాజుగా బాధ్యతలు స్వీకరించారు.. ఆమె మరణవార్తతో థాయ్ లాండ్ ప్రజలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.



