నవతెలంగాణ – హైదరాబాద్; రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్‌లో నిర్మించనున్న హైకోర్టు జోన్–II భవనానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు, హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో కోర్టు గదులు, డిజిటల్ లైబ్రరీలు, పరిపాలనా విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు రెండో దశలో న్యాయమూర్తుల నివాస గృహాలను కూడా నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రస్తుత అవసరాలకు హైకోర్టు సరిపోవడం లేదు. అలాగే ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనానికి హెరిటేజ్ గుర్తింపు ఉంది. చరిత్రను కాపాడుకుంటూ కొత్త భవన సముదాయం నిర్మిస్తున్నామన్నారు. రాబోయే వందేళ్ల వరకు ప్రజలు వచ్చేలా హైకోర్టు నిర్మాణం ఉండబోతోందన్నారు. న్యాయశాఖకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ డిసిషన్ హైకోర్టు నిర్మాణంపైనే తీసుకున్నామని వచ్చే ఏడాది డిసెంబర్ లోపు హైకోర్టు జోన్ -2 నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియరీ వ్యవస్థలు స్వతంత్రంగా పని చేస్తాయన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయం కీలకమైన మూలస్తంభం. న్యాయ వ్యవస్థ పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్నారు. ఇండియాలోని హైకోర్టు భవనాలతో పోల్చితే అతి పెద్ద భవనంగా ఇది నిలుస్తుందన్నారు.



