– అద్భుతమైన మేథస్సుతో సమాజానికి మానవ వనరులందిస్తాం : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
– ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన
– 105 స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్లు మంజూరు
నవతెలంగాణ-బోనకల్
దేశం గర్వించే స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో 105 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.21 వేల కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అద్భుతమైన మేథస్సుతో సమాజానికి మానవ వనరులను అందించాలన్నదే ఈ స్కూల్స్ ఉద్దేశం అని అన్నారు. సానపట్టిన వజ్రాల్లాగా తయారుచేసి ప్రపంచానికి జ్ఞానాన్ని అందించేలా స్కూల్స్‌ని డిజైన్ చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడంతో విద్యార్థుల భవిష్యత్తే తమ బాధ్యతగా భావించి.. అదనంగా మరో 47 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు విద్యార్థులకు క్రికెట్, ఫుట్‌బాల్ అవుట్‌డోర్, ఇండోర్ ఆటలకు సంబంధించి క్రీడా ప్రాంగణాలు ఉండేలా దాదాపు 25 ఎకరాల్లో డిజైన్ చేశామన్నారు. విద్యార్థులతో పాటు టీచింగ్ స్టాఫ్ ఉండే విధంగా వసతి గృహాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. డిజిటల్ క్లాస్ రూమ్‌లు, యాంపీ థియేటర్, సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన చేసే అధ్యాపక బృందాన్ని నియమిస్తామన్నారు. ఈ పాఠశాలలో చేరిన విద్యార్థులు 12వ తరగతి వరకు ఇందులోనే చదివి ప్రయోజకులవుతారని అన్నారు. అదే విధంగా విద్యార్థులకు పోషకాహారంతో కూడిన డైట్‌నూ అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
దేశం గర్వించేలా తీర్చిదిద్దుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES