Friday, May 9, 2025
Homeజాతీయంప్రమాదంలో న్యాయ వ్యవస్థ పునాదులు

ప్రమాదంలో న్యాయ వ్యవస్థ పునాదులు

- Advertisement -

– సంక్షోభంలో పోలీస్‌, జైలు వ్యవస్థలు
– సిబ్బంది, నిధుల కొరతతో ఇబ్బందులు
– మహిళలకు, అణగారిన వర్గాలకు లభించని సముచిత ప్రాతినిధ్యం
– కిక్కిరిసిపోతున్న కారాగారాలు
– పట్టించుకోని ప్రభుత్వాలు
దేశంలోని పోలీసు, జైళ్ల వ్యవస్థలు అసాధారణ రీతిలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఈ రెండు వ్యవస్థలూ నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కారాగారాలన్నీ పరిమితికి మించి కిక్కిరిసిపోయాయి. రెండింటిలోనూ సంస్థాగతంగా నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. దీంతో న్యాయ వ్యవస్థ పునాదే ప్రమాదంలో పడుతోంది. న్యాయ వ్యవస్థకు పునాదులుగా ఉండాల్సిన ఈ వ్యవస్థలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ అసమర్ధతకు నిలయంగా మారాయంటూ 2025వ సంవత్సరపు ఇండియా జస్టిస్‌ నివేదిక దిగ్భ్రాంతి కలిగించే గణాంకాలను వెల్లడించింది.
న్యూఢిల్లీ:
ఈ నివేదిక ప్రకారం…పోలీసు వ్యవస్థ సిబ్బంది కొరతతో కూనారిల్లిపోతోంది. ఉన్న సిబ్బందికి కూడా సరైన శిక్షణ లేదు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిబ్బందిలో సంసిద్ధత కన్పించడం లేరు. ప్రజలకు న్యాయాన్ని అందించడంలోనూ, వారి విశ్వాసాన్ని కాపాడుకోవడంలోనూ కీలకంగా ఉండాల్సిన ఈ వ్యవస్థలో దీర్ఘకాలిక సామర్ధ్యం కొరవడింది. ప్రజలలో అపనమ్మకం పెరిగిపోతోంది. జాతీయ స్థాయిలో ప్రతి లక్ష మంది జనాభాకు 155 మంది పోలీసులు అందుబాటులో ఉన్నారు. మంజూరైన సిబ్బంది (197.5) కంటే ఇది చాలా తక్కువ. ఐక్యరాజ్యసమితి సిఫార్సు చేసిన (222) సంఖ్య కంటే మరింత తక్కువ. రాష్ట్ర స్థాయిలో ఈ అసమానతలు మరింత అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు బీహార్‌లో లక్ష మంది జనాభాకు కేవలం 81 మంది పోలీసులు మాత్రమే అందు బాటులో ఉన్నారు. ఫలితంగా సమాజానికి అవసరమైన సేవలు లభించడం లేదు.
శిక్షణ ఏది?
పోలీసు వ్యవస్థను వేధిస్తున్న మరో సమస్య ఖాళీలు. 2023 నాటికి జాతీయ స్థాయిలో అన్ని ర్యాంకులలో మంజూరైన పోస్టులలో 22 శాతం ఖాళీగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో ఇది 25 శాతం కంటే ఎక్కువగానే ఉంది. అప్పుడప్పుడు మాత్రమే నియామకాలు చేపడుతున్నారు. అవి ప్రజావసరాలకు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఉన్న సిబ్బందికి శిక్షణ ఇచ్చి, వారిలో సామర్ధ్యాన్ని పెంచే ప్రయత్నాలు కూడా తగినన్ని జరగడం లేదు. సమర్ధవంతమైన పోలీస్‌ వ్యవస్థకు శిక్షణ ఎంతో అవసరం. అయితే దానికి నిధులు చాలా తక్కువగా కేటాయిస్తున్నారు. రాష్ట్రాలు తమ పోలీస్‌ బడ్జెట్‌లో సగటున కేవలం 1.25 శాతం మాత్రమే శిక్షణకు కేటాయిస్తున్నాయి. దేశంలోని కేవలం నాలుగు రాష్ట్రాలు మాత్రమే రెండు శాతం కంటే అధికంగా నిధులు సమకూరుస్తున్నాయి. ఐదు రాష్ట్రాలలోనే పూర్తిగా గుర్తింపు పొందిన పోలీసు శిక్షణ అకాడమీలు ఉన్నాయి. సైబర్‌ నేరాల దర్యాప్తు, బాలల న్యాయం, ఫోరెన్సిక్‌ నిర్వహణ, లింగ సంబంధమైన అంశాలకు సంబంధించి ప్రత్యేక శిక్షణ ఇచ్చే వ్యవస్థలు దేశంలో లేనే లేవు. ఫోరెన్సిక్‌ సిబ్బంది తగిన సంఖ్యలో లేకపోవడంతో దర్యాప్తులో నాణ్యత లోపిస్తోం ది. విచారణ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దేశంలో మంజూరైన ఫోరెన్సిక్‌ పోస్టులలో సగం ఖాళీగానే ఉన్నాయి.
ముందుకు సాగని ఆధునీకరణ
మౌలిక సదుపాయాల ఆధునీకరణ కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతోంది. దేశంలోని 83 శాతం పోలీస్‌ స్టేషన్‌లలో ఒకే ఒక సీసీటీవీ కెమేరా ఉంది. 78 శాతం పోలీస్‌ స్టేషన్లు మహిళా హెల్ప్‌డెస్కులు ఏర్పాటు చేశాయి కానీ రాష్ట్రాలుకానీ, కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ మహిళలకు సంబంధించిన అంతర్గత రిజర్వేషన్ల లక్ష్యాలను చేరుకోలేదు. ఈ విషయంలో జాతీయ సగటు 12 శాతం కంటే తక్కువగానే ఉంది. చండీగఢ్‌, లడఖ్‌, తమిళనాడు వంటి రాష్ట్రాలు మాత్రమే 33 శాతం రిజర్వేషన్ల అమలు దిశగా ముందుకు సాగుతున్నాయి.
2017-22 మధ్యకాలంలో పట్టణ పోలీస్‌ స్టేషన్ల సంఖ్య నాలుగు శాతం పెరగగా గ్రామీణ ప్రాంతాలలో ఏడు శాతం తగ్గాయి. స్థానికులలో విశ్వాసాన్ని నింపేందుకు కమ్యూనిటీ పోలీసింగ్‌ చర్యలు ఎంతో అవస రం. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాయి. అయితే అక్కడ కూడా నిధుల కొరత ఉంది. పోలీస్‌ స్టేషన్లలో ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేకపోవడం, విద్యుత్‌ సమస్యల కారణంగా డిజిటలీకరణ యత్నాలు నత్తనడక నడుస్తున్నాయి.
మహిళలు, అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం కరువు
పోలీసు వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం తగినంత లేదు. అన్ని పోలీసు వ్యవస్థలలో కలిపి మహిళల ప్రాతినిధ్యం కేవలం 12.3 శాతం మాత్రమే ఉంది. బీహార్‌లో ఇది 24 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 22 శాతంగా ఉంది. దీనికి భిన్నంగా తెలంగాణ, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ సహా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మహిళల ప్రాతి నిధ్యం 10 శాతం కంటే తక్కువగా ఉంది. పోలీసు వ్యవస్థలో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ లక్ష్యాన్ని చేరుకున్న ఏకైక రాష్ట్రం కర్నాటక మాత్రమే. గుజరాత్‌, మణిపూర్‌, కర్నాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు ఎస్సీ రిజర్వ్‌డ్‌ కోటాను, బీహార్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు ఎస్టీ కోటాను పూర్తి చేశాయి. తమిళనాడు, సిక్కిం, కేరళ రాష్ట్రాలలో ఓబీసీలకు 40 శాతం కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఉన్నాయి. తమిళ నాడు తన కోటాను మించిపోయింది. మానవ వనరులను పెంచకుండా, ఫోరెన్సిక్‌-డిజిటల్‌ సామర్ధ్యాలను మెరుగు పరచకుండా, మహిళలకు, అణగారిన తరగ తులకు తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా, గ్రామీణ పోలీసిం గ్‌ను బలోపేతం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే దేశీయ పోలీసింగ్‌ వ్యవస్థ మరింతగా సమస్యల ఊబిలో కూరుకుపోతుందని ఇండియా జస్టిస్‌ నివేదిక తేల్చి చెప్పింది.
కారాగారంలో ఖాళీ ఏది?
ఇక దేశంలో జైళ్ల వ్యవస్థ ఇప్పటికే తలకు మించిన భారాన్ని మోస్తోంది. అది ఇప్పుడు సంక్షోభ దశకు చేరుకుంది. కారాగారాలన్నీ కిక్కిరిసి ఉన్నాయని, నిధుల కేటాయింపులు కూడా తక్కువగానే ఉంటోందని, సిబ్బంది కొరత వేధిస్తోందని ఇండియా జస్టిస్‌ నివేదిక వేలెత్తి చూపింది. గత దశాబ్ద కాలంలో జైళ్లలో మగ్గుతున్న వారి సంఖ్య దాదాపు యాభై శాతం పెరిగింది. దానికి తగినట్లు మౌలిక సదుపాయాలు, వైద్య రక్షణ, సిబ్బంది నియామకం జరగలేదు. జాతీయ స్థాయిలో జైళ్లు 131 శాతాన్ని మంది ఖైదీలతో కిటకిటలాడుతున్నాయి. 176 జైళ్లలో పరిమితికి మించి రెట్టింపు సంఖ్యలో ఖైదీలు ఉన్నారు. అనేక కారాగారాలు సామర్ధ్యం కంటే నాలుగు రెట్లు అదనంగా కిక్కిరిసిపో యాయంటే పరిస్థితి అర్థమవుతుంది.
విచారణ ఖైదీలే అధికం
అన్నింటికంటే ఆందోళన కలిగించే విషయమేమంటే జైళ్లలో ఉన్న వారిలో 76 శాతం మంది విచారణ ఖైదీలే. 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అండర్‌ట్రయల్స్‌లో 20 శాతం మందికి పైగా నేర నిర్ధారణ జరగకుండానే ఒకటి నుండి మూడు సంవత్సరాలు జైళ్లలో మగ్గుతున్నారు. విచార ణకు ముందే జైలు జీవితం గడుపుతున్న వారి సంఖ్య గతంలో కంటే ఇప్పుడు బాగా పెరిగిం ది. 2022 చివరి నాటికి 11,448 మంది (2.6 శాతం) విచారణకు ముందు ఐదు సంవత్సరాల పాటు జైలు ఊచలు లెక్కబెడుతూ గడపాల్సి వచ్చింది. వీరిలో ఉత్తరప్రదేశ్‌లోనే 40 శాతం మంది ఉండడం గమనార్హం.
పడుకునేందుకు చోటే లేదు
జైళ్లలో మౌలిక సదుపాయాలు, వైద్య చికిత్సల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సుప్రీంకోర్టు నియమించిన అమితావ రారు కమిటీ నివేదిక ప్రకారం 68 శాతం ఖైదీలకు మాత్రమే జైలులో నిద్రిం చేందుకు అవసరమైన స్థలం అందుబా టులో ఉంది. ప్రతి మూడు వం దల మంది ఖైదీలకు ఒక వైద్యుడు అందుబాటులో ఉండా ల్సి ఉండగా ఆ ప్రమాణం ఎక్కడా అమలు కావడం లేదు. మానసిక ఆరోగ్య సేవల ఊసే ఉండడం లేదు. మాన సిక ఆరోగ్య నిపుణులు చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నారు.
ఈ సమస్యలు కూడా…
జైళ్లలో మంజూరైన పోస్టులలో 33 శాతం కంటే ఎక్కువ గానే ఖాళీగా ఉన్నాయి. ఇక ఖైదీల పునరావాసం, వృత్తిపరమైన శిక్షణ, సంక్షేమం కోసం జైలు బడ్జెట్లలో కేటాయింపులు ఒక శాతం కూడా ఉండడం లేదు. పైగా వాటిని కూడా ఉపయోగించడం లేదు. చాలా వరకూ దారి మళ్లుతున్నాయి. జైళ్లలో వీడియో కాన్పరెన్స్‌ సౌకర్యాలు ఉన్నప్పటికీ అవి విచారణలో జాప్యాన్ని, నిర్బంధ కాలాన్ని తగ్గించలేకపోతున్నాయి. జైళ్ల లోపల న్యాయ సహాయ సేవల పరిస్థితి దారుణంగా ఉంటోంది.
67 శాతం జైళ్లలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ కూడా న్యాయవాదులకు చాలా తక్కువ మొత్తం లో పారితోషికం (కేసుకు రూ.500-1000) అందిస్తుండడంతో వారు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కేవలం 16 రాష్ట్రాలలోనే ఓపెన్‌ జైళ్లు ఉన్నాయి. ప్రసూతి, శిశు సంరక్షణ కోసం కేటాయిస్తున్న నిధులు ఏ మూలకూ చాలడం లేదు. 2017-22 మధ్య కాలంలో కస్టడీ మరణాలు పెరగడంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ లోపాలన్నింటినీ సవరించినప్పుడే జైళ్లలో పరిస్థితులు మెరుగుపడతాయని కమిటీ సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -