నవతెలంగాణ-హైదరాబాద్ : అన్నమయ్య జిల్లా రాయచోటిలో వరదలు పెను బీభత్సం సృష్టించాయి. వరద నీటిలో చిక్కుకుని నలుగురు మృత్యువాత పడగా.. ఇప్పటి వరకు మూడు మృతదేహాలు లభ్యం అయ్యాయి, మరో బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, రాయచోటి పట్టణంలోని కె రామాపురం దగ్గర గల్లంతైన బాలిక యామిని మృతదేహం కోసం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ప్రత్యేక యంత్రాల ద్వారా డ్రైనేజీ కాలువకు రంద్రాలు చేసి సుమారు 12 గంటల పాటు కొనసాగిన గాలింపు చర్యలు. చివరకు సాయి హాల్ దగ్గర డ్రైనేజీలో బాలిక యామిని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనా స్థలాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు.
అయితే, రాయచోటి పట్టణంలోని కొత్తపేట రామాపురం నాలుగు కులాల దగ్గర రాత్రి విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో వరద నీటిలో చిక్కుకుంది. ఆటోలో మొత్తం ఏడుగురు విద్యార్థులు ఉండగా.. స్థానికుల సహకారంతో ఆరుగురిని రక్షించగా, యామిని అనే స్టూడెంట్ మాత్రం గల్లంతైంది. ఇక, రాయచోటి ఎస్‌ఎన్ కాలనీలో డ్రైనేజీ కాలువలో పడిపోయిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, అప్రమత్తమైన స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. వరద ప్రభావంతో పరిస్థితి విషమంగా మారగా, అధికారులు గాలింపు చర్యలు ఇంకా కొనసాగిస్తున్నారు.