నవతెలంగాణ-హైదరాబాద్ : రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు మృతి చెందగా, మరో 8 మంది కిడ్నీ సమస్యలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఘటనకు కారణమైన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందని అధికారుల విచారణలో నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈరోజు ఫోరెనిక్స్ నివేదికలు వస్తే అధికారికంగా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది.
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం నరసాపురంకు చెందిన గణేష్ అనధికారికంగా నిర్వహిస్తున్న వరలక్ష్మీ డెయిరీలో, పాలు కల్తీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. డెయిరీలోని రిఫ్రిజిరేటర్ లో కూలెంట్‌గా వినియోగించే ఇథిలీన్ గ్లైకాల్ ఈ నెల 15వ తేదీన లీకై, ఒక పాల క్యాన్‌లో కలిసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అదే రోజు సరఫరా చేసిన పాలు వినియోగించిన కుటుంబాల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాలకు చెందిన నాలుగు కుటుంబాల్లో 12 మంది, అనూరియా సమస్యతో ఆసుపత్రుల్లో చేరారు.
కాగా, ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 8 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉండగా, ఒక చిన్నారి మరో ఇద్దరు వృద్ధుల పరిస్థితి విషమంగా ఉంది.



