– తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహాదారు చౌడారపు రాంప్రసాద్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గణిత లేబరేటరీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర సలహాదారు చౌడారపు రాంప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇటీవల ప్రతి పాఠశాలకు సైన్స్, గణిత ప్రయోగశాల, మాన్యువల్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. చాలావరకు పాఠశాలలో సైన్స్ ప్రయోగశాలలో గతంలోనే నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ఎక్కువ శాతం పాఠశాలలో గణిత ప్రయోగశాలలు లేవన్నారు.
గతంలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ పథకం కింద ప్రభుత్వం లేబరేటరీ వస్తువుల కోసం నిధులు మంజూరు చేసిందని, ప్రస్తుతం ఆ పథకం రద్దు కావడంతో ప్రయోగశాల పరికరాలకు నిధుల విడుదల జరగడం లేదని తెలిపారు. వచ్చే స్కూల్ గ్రాంటు పాఠశాల అవసరాలకు సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం గణిత ప్రయోగశాలకు కనీసం రూ.10వేలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గణితంలో కృత్యాధార బోధన ద్వారా అమూర్త భావనలను విద్యార్థులు త్వరగా అర్థం చేసుకోవడమే కాకుండా భవిష్యత్తులో గణితం సబ్జెక్టు పట్ల ఆసక్తి అభివృద్ధి పెంచుకుంటారన్నారు. గణితలో ప్రయోగ పద్ధతి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను బోధించవచ్చని రాంప్రసాద్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గణిత లేబరేటరీకి ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు.