Tuesday, April 29, 2025
Navatelangana
Homeఎడిట్ పేజినిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి

- Advertisement -

భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. అగ్నిగుండమవుతున్నది. ఉష్ణోగ్రతలు 45.5 డిగ్రీలు దాటాయి. మనుషుల మాడు పగిలేంత తీవ్రత కనిపిస్తున్నది. ఒకవైపు సూర్యుడి ప్రతాపం, మరోవైపు అకాలవర్షాలతో వింత వాతావరణం నెలకొంది. ఎండలు సాధారణ జనాన్ని భయపెడుతున్నాయి. ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. గత రెండునెలల్లో వడదెబ్బతో దాదాపు 23 మంది చనిపోగా, గత బుధవారం ఏడుగురు, గురువారం నలుగురు మృతి చెందడం గమనార్హం. ఫిబ్రవరి నుంచే భానుడు భగభగ లాడుతున్నాడు. సాధారణం కన్నా ఎండవేడి విపరీతంగా పెరిగింది. 2022లో ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉండగా, 2024 వచ్చేసరికి 45 డిగ్రీలకు పెరిగింది. ఈఏడాది అది కూడా 0.5డిగ్రీలు పెరిగి 45.5 డిగ్రీలకు చేరింది. దీనికి పర్యావరణంలో నిత్యం చోటు చేసుకుంటున్న విపరీతధోరణులే కారణం.
ఫసిఫిక్‌ మహాసముద్రంలో ‘లా నినా’తో నీటి ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ‘ఎల్‌ నినో’కు ఇది భిన్నం. లా నినా ప్రక్రియలో జాప్యం మూలంగా వచ్చే జూన్‌లో వర్షాలు సైతం ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అంచనా. లా నినా సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో తగ్గుతుంది. సాధారణంగా తక్కువ వర్షపాతం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా తగ్గవచ్చు. ఇది పంటలపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం.ఈ పరిస్థితుల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే దిశగా చర్యలు తీసుకోవడంలో ఆయా సర్కారీ శాఖలు అప్రమత్తంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు.
ఎండల సమస్య రాష్ట్రానిదేగాక, దేశంతోపాటు ప్రపంచానిది కూడా. అసలు ఎండలకు కారణమెంటో విస్తృత అధ్యయనం అవసరం. మూలాలను వెతికిపట్టుకోవాలి. ఇష్టారాజ్యంగా అడవుల నరికవేత, అభివృద్ధి పేర కుంటలు, చెరువుల పూడ్చివేత, కొండల తొల్చివేత పర్యావరణానికి ముప్పును తెస్తున్నాయి. ఈ పరిస్థితి మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో చెట్ల నరికివేత, వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో నేవీ రాడార్‌ కేంద్రం కోసం వేలాది చెట్లను అడ్డంగా తొలగిస్తున్న వైనం తెలిసిందే. ప్రకృతికి ఆలవాలం, దేశానికి వన్నె అయిన హిమాలయాల్లోనూ రోడ్లు, ఇతర సౌకర్యాల కోసం చెట్లను నిర్ధాక్షిణ్యంగా పడేస్తున్నారు. ఇష్టా రీతిన వ్యవహరిస్తు న్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఏడాదికోసారి మొక్కలు నాటడంతోనే సరి పోదు. పచ్చదనం పెంచే కార్యక్రమాలు విరివిగా జరగాలి. నిరంతర ప్రాధాన్యత, పర్యవేక్షణ ఉండా లి.ప్రభుత్వాలు అప్రమ త్తంగా ఉండి, పట్టించుకుంటేనే ప్రకృతి కరుణిస్తుంది. బీభత్సాలు జరగవు. తద్వారా జీవవైవిద్యానికి ప్రమాదముండదు.
కాగా ఎండల నేపథ్యంలో రుతుపవనాలు, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ వానాకాలం పంటలను ఎంచుకోవాలని వ్యవసాయ శాఖ రైతులకు సలహా ఇస్తున్నది. ఎండాకాలంలో విద్యుత్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. కాగా ప్రజల అవసరాలను నెరవేర్చడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మిన్నకుంటున్నాయి. గత రెండేండ్లతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో మరింత ఎక్కువగా వేడి నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయనేది వాతావరణ శాఖ అవగాహన.ఇక భానుడి ప్రతాపానికి ‘ఆమ్మో ఎండలు’ అంటూ సాధారణ జనం ఇండ్ల నుంచి బయట కొచ్చేందుకు జంకుతున్నారు. నెత్తిమీద గొడుగు పెట్టుకుని, టోపీలు ధరించి అవసరమైతేనే రోడ్డుమీదకొస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటలకే ఎండలు మోతమోగిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నిప్పులకుంపటవుతున్నది. పట్టపగలే రోడ్లు నిర్మానుష్యమ వుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలంటూ వాతావరణ శాఖ తరచూ హెచ్చరిస్తున్నది.
ఇదిలా ఉంటే, అకాలవర్షాలతో వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి తదితర పంటలు సుమారు లక్ష ఎకరాల్లో నష్టం జరిగింది. వడగండ్ల వాన, ఈదురుగాలుతో పంటలు దెబ్బతినడం, విద్యుత్‌ తీగలు తెగిపడటం జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.1100 కోట్ల మేర పంటనష్టం జరిగినట్టు సర్కారీ నివేదికలే చెబుతున్నాయి.
పరిహారంగా రైతులకు ఆహార ధాన్యపు పంటలకు ఎకరాకు రూ. 20 వేలు, వాణిజ్య పంటలకు రూ.40 వేలివ్వాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాగా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదు. తాగునీటి వసతుల్లేక వన్యప్రాణులు, మూగ జీవాల పరిస్థితి దారుణంగా మారింది. ఎండలు, ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. తీవ్రమైన ఎండలవేడితో ఉపాధి హామీతోపాటు సాధారణ రోజూ కూలీలు, ఉద్యోగులు, వీధి వ్యాపారులు, పంచాయతీ, మున్సిపల్‌, నిర్మాణరంగ, కరెంటు తీగలమీద పనిచేసే కార్మికులతోపాటు ఇతరులూ తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అందుకే పర్యావరణ పరిరక్షణే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు