నవతెలంగాణ-హైదరాబాద్: గణేష్ నిమజ్జనోత్సవం హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై అట్టహాసంగా కొనసాగుతుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ గణనాథుల విగ్రహాలు తరలించే వాహనాలు బారులు తీరాయి. తిరొక్క ఆకృతిలో ఉన్న బొజ్జ గణపయ్య విగ్రహాలు కన్నువిందు చేస్తున్నాయి. విభిన్న ఆకృతిలో ఉన్న గణనాథులను చూడడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నగరంతో పాటు పలు ప్రాంతాల నుంచి గణనాథుల విగ్రహాలను తీసుకొని భక్తులు తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనోత్సవం చూడానికి భక్తులు తండోపతండాలు తరలివస్తున్నారు. దీంతో ట్యాంక్ బండ్ కు వచ్చే దారులన్ని రద్దీగా ఉన్నాయి. పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్, చార్మినార్ నుంచి నాంపల్లి, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు జనాలతో కిటకిటలాడుతున్నాయి. గణేష్ మహారాజ్ జై అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి.
అదే విధంగా నిమజ్జనోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. నిఘా నేత్రాల సాయంతో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంలో పరిశీలిస్తున్నారు. వేలమంది పోలీస్ సిబ్బందితో భారీగా బందోబస్తు కల్పించారు.