నవతెలంగాణ-హైదరాబాద్: ఇటీవల సంతకం చేసిన గాజా శాంతి ఒప్పందం మధ్యప్రాచ్యంలో స్థిరత్వానికి ఒక చారిత్రాత్మక అడుగు అని భారతదేశం పేర్కొంది. ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్య శాశ్వత శాంతిని సాధించడానికి రెండు దేశాల పరిష్కారం ఏకైక ఆచరణాత్మక మార్గం అని పునరుద్ఘాటించింది. గురువారం మధ్యప్రాచ్యంలో పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి (యుఎన్‌ఎస్‌సి) త్రైమాసిక బహిరంగ చర్చలో యుఎన్ భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడారు. ”స్థిరమైన మరియు శాంతియుతమైన మధ్యప్రాచ్య దార్శనికతను సాకారం చేసుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. సౌకర్యాల లేమి, అగౌరవం రోజువారీ జీవితంలో భాగం కాకూడదు. సంఘర్షణ కారణంగా పౌరులు మరణించకూడదు” అని అన్నారు. ఈ ప్రయత్నానికి భారతదేశం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ నెల ప్రారంభంలో షర్మ్ ఎల్-షేక్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంతో ఏర్పడిన సానుకూల దౌత్యపరమైన చర్య ఈ ప్రాంతంలో శాశ్వత శాంతికి దారితీస్తుందని భారత్ ఆశిస్తోందని అన్నారు. శాంతి ఒప్పందంపై సంతంకం చేయడాన్ని స్వాగతిస్తూ.. ఈ ఒప్పందాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన అమెరికాను, సహకారం అందించిన ఈజిప్ట్, ఖతార్‌లను ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.
వెస్ట్‌బ్యాంక్‌ను విలీనం చేసుకునేందుకు ఇజ్రాయిల్ పార్లమెంట్ ప్రాథమిక బిల్లును ఆమోదించడంపై కూడా ఆయన స్పందించారు.చర్చలు, దౌత్యం మరియు రెండు దేశాల పరిష్కారం శాంతిని సాధించడానికి మార్గమని భారత్ తన అభిప్రాయంపై ధృడంగా ఉందని అన్నారు. అమెరికా చొరవతో శాంతివైపు దౌత్యపరమైన చర్య ప్రారంభమైందని, ఈవిషయంలో అన్ని దేశాలు తమ బాధ్యతలకు కట్టుబడి ఉండాలని అన్నారు. ఇజ్రాయిల్ చేపడుతున్న ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కొనసాగుతున్న శాంతి ప్రయత్నాలను అడ్డుకోకండా, అన్ని దేశాలు మద్దతు ప్ర కటించాల్సిన సమయమిదని అన్నారు.


