- హింసలేని సమాజం, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన
నవతెలంగాణ-దోమకొండ: దోమకొండ మండల సమాఖ్య కార్యాలయంలో జెండర్ అంశంపై గురువారం అధికారులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఒక జెండర్ ప్రతినిధి చొప్పున మొత్తం 29 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, జెండర్ ప్రాజెక్ట్ కార్యనిర్వాహకులు లింగ గౌడ్ లు మాట్లాడుతూ గ్రామాలలో హింసలేని కుటుంబాల ఏర్పాటుకు కృషి చేయాలని, అంటరానితనం నిర్మూలన, జనన – మరణాల నమోదు, బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మూఢనమ్మకాలను విడిచిపెట్టాలని, మానవ అక్రమ రవాణాను అరికట్టాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించడంతో పాటు కుటుంబాలకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రభాకర్, మానవ అక్రమ రవాణా నిర్మూలనపై ప్రసంగించారు. బాల్య వివాహాలు నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు సుప్రియ అవగాహన కల్పించారు.
మహిళా సంఘాల అభివృద్ధిలో జెండర్ కార్యక్రమం దోమకొండ మండలానికి రావడం ఆనందకరమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి విజయలక్ష్మి, జిల్లా ప్రాజెక్టు నిర్వహణాధికారి శ్రీనివాస్, మండల సమాఖ్య సభ్యులు, సహాయక ప్రాజెక్టు సిబ్బంది, కమ్యూనిటీ సమన్వయకర్తలు పాల్గొన్నారు.



