నవతెలంగాణ-హైదరాబాద్ : నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. డివిజన్ల డీలిమిటేషన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ను అధికారులు సభలో ప్రవేశపెట్టారు. డివిజన్ల విభజనపై ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు కార్పొరేటర్లు మాట్లాడారు. డీలిమిటేషన్‌పై తమ అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్ల విభజన ఏ ప్రాతిపదికన చేశారో తెలియట్లేదని అసహనం వ్యక్తం చేశారు.
డివిజన్ల పునర్విభజనకు వ్యతిరేకంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా డివిజన్ల పెంచుతున్నారని ఆందోళన చేపట్టారు. ఎంఐఎంకు అనుకూలంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పునర్విభజన చేపట్టాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఆ 3 పార్టీలు ఏకమయ్యాయన్నారు.



