నవతెలంగాణ- హైదరాబాద్: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం తరఫున స్వామివారికి భారీ విరాళం అందింది. సుమారు రూ.1.80 కోట్ల విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి పళ్లాలను మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ సోమవారం శ్రీవారికి కానుకగా సమర్పించారు.
ఈ కానుకల స్వీకరణ కార్యక్రమాన్ని తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ, ఆలయ పేష్కార్ రామకృష్ణకు ఈ విలువైన కానుకలను అందజేశారు. తిరుమలకు విచ్చేసే భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ నగదు, బంగారం, వెండి రూపంలో కానుకలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే గోకర్ణ మఠం పీఠాధిపతి ఇంతటి భారీ విరాళాన్ని అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో టీటీడీ బొక్కసం ఇంఛార్జ్ గురురాజ్ స్వామితో పాటు ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.