నవతెలంగాణ-హైదరాబాద్: 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరనున్న విషయం తెలిసిందే. ఈనెల 6న మొదటి దఫా 121 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ తర్వాత రెండో దశలో 11న మిగిలిన అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. 14న ఫలితాలు వెల్లడించనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వచ్చిన బీహారీలు తమ రాష్ట్రానికి తరలిపోతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించడానికి వివిధ రహణా మార్గాల ద్వారా బీహార్‌కు చేరుకుంటున్నారు.
ఈక్రమంలో తాజాగా కర్నాటక డిప్యూటీ సీఎం శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల సందర్భంగా తమ రాష్ట్రంలో ఉన్న బీహార్ ప్రజలకు వేతన కూడిన సెలవులు మంజూరు చేయాలని ఆయా సంస్థలకు ఆయన పిలుపునిచ్చారు. వివిధ వ్యాపార సంస్థలు, హోటల్స్, భవన నిర్మాణ సంస్థ, కాంట్రాక్టర్స్ అందరూ బీహారీలకు వేతన కూడిన మూడు రోజులు సెలవులు మంజూరు చేయాలని సూచించారు. దీంతో వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు.

                                    

