Friday, May 2, 2025
Homeతాజా వార్తలుసమ్మె ఆలోచన విరమించండి

సమ్మె ఆలోచన విరమించండి

– ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
– చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
– ప్రతి నెలా రాష్ట్ర ఆదాయం రూ.18 వేల కోట్లు
– ప్రభుత్వ కనీస వ్యయం రూ.22 వేల కోట్లు
– ఈ మొత్తం అప్పులు, వడ్డీలకే పోతుంది
– కేసీఆర్‌ మాటలు నమ్మి మోసపోకండి
– క్లిష్ట సమయంలో సహకరించాలని ప్రజలకు వినతి
– రవీంధ్రభారతిలో ఘనంగా మేడే వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

”సమ్మె ఆలోచన విరమించండి. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. గత పదేండ్లలో ఆర్థిక విధ్వంసం జరిగింది. పంతాలు, పట్టింపులకు పోకండి. ఏవైనా సమస్యలుంటే సంబంధిత మంత్రితో చర్చించండి. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచించండి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రాష్ట్రం సమ్మె వల్ల తీవ్రంగా నష్ట పోనుంది. సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి” అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన మేడే ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత సర్కార్‌ నిర్వాకం వల్ల రాష్ట్రం సంక్షోభంలో కూరుకు పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌ పద్మనాభం లాగా ఆచి తూచి ఖుర్చు చేస్తున్నా ప్రతి నెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ”ప్రభుత్వానికి ప్రతినెలా రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కిస్తీలకు రూ.6.5 వేల కోట్లు పోతోంది. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.6 వేల కోట్లు ఖర్చవుతోంది. ప్రతి నెలా రూ.22 వేల కోట్లు వస్తే తప్ప ప్రభుత్వ కనీస అవసరాలు తీరవు. మాజీ సీఎం కేసీఆర్‌ రూ.8.15 లక్షల కోట్ల అప్పు చేసి పదవి దిగి వెళ్లిపోయారు. అప్పడు చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోయాయో ఆనవాళ్లు తెలియడం లేదు. కేసీఆర్‌ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు 15 నెలల్లో రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చింది. ఆర్థికంగా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కొత్త డిమాండ్లు చేసే ముందు ఆలోచించండి. ఏమైనా సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుందాం” అని సీఎం ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ పదేండ్ల కాలంలో ఎందుకు రూ.8.15 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకు పోయిందో తెలంగాణ సమాజం అలోచించాల్సిన ఆవసరం ఉందని అన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోతే కేసీఆర్‌ కుటుంబానికి పత్రికలు, ఛానెళ్లు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. గత సర్కార్‌ హయాంలో కనీసం ధర్నా చౌక్‌లో నిరసన తెలిపే హక్కు లేకుండా దాన్ని మూసేశారని విమర్శించారు. కేసీఆర్‌ రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం మూడేండ్లకే కూలిపోయిందని ఆరోపించారు. ”ఉట్టి తెగిపడాలని మాజీ సీఎం రోజూ శాపనార్థాలు పెడుతున్నారు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని ఆయన గుర్తుంచుకోవాలి. కపట నాటక సూత్రధారి మళ్లీ బయటకు వచ్చాడు. తెలంగాణ సమాజం ఆయన మాటలు నమ్మి మోసపోవద్దు” అని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.వెయ్యిగా ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నామని చెప్పారు. తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. పేదలకు సన్న బియ్యం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా, గిగ్‌ వర్కర్లకు ప్రత్యేక పాలసీ ఇలా అధికారం చేపట్టిన 15 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని వివరించారు. విద్యలో నాణ్యతను పెంచేందుకు అనేక చర్యలు చేపట్టామని సీఎం పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఐటీఐలను ఆడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ సెంటర్లు (ఏటీసీ)గా మార్చుతున్నామని చెప్పారు. ”రాష్ట్రంలోని వంద నియోజక వర్గాల్లో రూ.2,400 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. ఇంజినీరింగ్‌ విద్యలో ప్రస్తుతం పరిశ్రమల అవసరాలకు తగిన కోర్సులు లేవు. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచాలని స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. దేశంలో ఏరాష్ట్రం అమలు చేయని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నాం. అన్నింటా దేశానికి తెలంగాణ రోల్‌ మాడల్‌గా నిలుస్తోంది. తెలంగాణ రైజింగ్‌ను ఆపడం ఎవరి తరం కాదు” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన పలువురికి శ్రమశక్తి, ఉత్తమ యాజమాన్య అవార్డులను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img