Tuesday, April 29, 2025
Navatelangana
Homeఎడిట్ పేజిభూగోళ సుస్థిరతను కాపాడుకోలేమా?

భూగోళ సుస్థిరతను కాపాడుకోలేమా?

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా నిన్ననే భూగోళ సంరక్షణ దినోత్సవం జరుపుకున్నాం. ఈఏడాది ‘అవర్‌ పవర్‌..అవర్‌ ప్లానెట్‌” అనే థీమ్‌తో ఎర్త్‌డే గురించి ఐక్యరాజ్య సమితి అవగాహన కల్పిస్తున్నది. ఇది ఒక్కరోజుకే పరిమితం కాకుండా ప్రకృతి, పర్యావరణవేత్తలు వారం రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహి స్తారు. భూమి, పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడమే దీని ముఖ్యఉద్దేశం. అయితే ఆదిశగా మానవజాతి ముందుకు సాగుతుందా?లేదా అనేది ఇక్కడ చర్చించు కోచాల్సిన అంశం. ఈరోజు గాలి, నీరు, ప్రకృతి మనిషికి ఎంత ప్రధానమో గుర్తించడం లేదు. రోజురోజుకూ పర్యావరణంపై దాడి పెరుగుతున్నదే తప్ప తగ్గడం లేదు. దీనికి అవగాహన లేకపోవడం ఒకటైతే, ప్రభుత్వాలు కూడా పట్టించుకోక పోవడం మరో కారణం. అందుకే ప్రకృతిని మనం రక్షిస్తే మనల్ని అది రక్షిస్తుందన్న నినాదం క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడం కూడా అందరి బాధ్యత. దాన్ని విస్మరిస్తే రాబోయే తరాలకు మనమిచ్చే సురక్షితమైన వాతావరణం ఏమీ మిగలదు. అంతా కలుషితమై, జబ్బుల బారినపడే పరిస్థితే ఉంటుంది.
ఈ విశాల విశ్వంలో మానవజాతిలాంటి జీవులు కలిగి ఉన్న ఒకే ఒక గ్రహం భూగోళం. దీనిపై జీవుల ఆవిర్భావం దాదాపు 350 కోట్ల ఏళ్ల క్రితం జరిగింది. ధరిత్రి ఇప్పటిస్థితికిి చేరడానికి దాదాపు 460 కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. విశ్వంలో మనలాంటి జీవాలు గల ఇతర గ్రహం మరేదైనా ఉందా అనే దిశలో పరిశోధనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకూ ఆధారాలు దొరకలేదు. ఇప్పటి ధరిత్రిని అస్థిరపరిచే ఎన్నో చర్యలు కొనసాగుతున్నాయి. ధరిత్రిలోని అన్ని జీవాలను పూర్తిగా నాశనం చేయగల అణుబాంబులు సామ్రాజ్యవాద దేశాల వద్ద ఉన్నాయి. వీటిని సమకూర్చుకోడానికి మరికొన్ని దేశాలు తీవ్ర కృషి చేస్తున్నాయి.అమెరికా, దాని మిత్రదేశాలు తాము శత్రువులుగా భావించిన ఇతర దేశాలపై ఈ బాంబుల్ని ప్రయోగించడానికి వెనుకాడబోమని బెదిరిస్తున్నాయి. ప్రకృతి వనరులను కొల్లగొట్టేందుకు ఏవో సాకులతో యుద్ధాలు, ఆక్రమణలు జరుగుతున్నాయి. పర్యావరణానికి ఇవి కలిగిస్తున్న హాని అసలు అధ్యయనానికే నోచుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు! ఇది చాలదన్నట్లు మానవుడు తన అవసరాలకూ, విలాసాల కోసం, స్వార్థం కోసం విధ్వంసానికి పాల్పడుతున్నాడు. వృక్షాలను నరికేస్తున్నాడు. అడవుల్లో జంతువుల్ని బలితీసుకుం టున్నాడు. కొండల్ని పిండేస్తున్నాడు. ఇంకా అనేక రకాలుగా భూమిని నాశనం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా భూతాపాన్ని అస్థిరపరిచేవిగా ఉన్నాయి.
భూగోళంతోనే..మన క్షేమం..
నేలతల్లి బాగుంటేనే… ఆ తల్లి బిడ్డలమైన మనం బాగుంటాం. అటువంటి తల్లి ఆరోగ్యాన్నే హరించే పనులు మనం చేస్తుంటే, ఇంకేముంది? భవిష్యత్తు అంధకారమే అవుతుంది. ఈ హెచ్చరికనే ధరిత్రి దినోత్సవం మరోసారి గుర్తు చేస్తున్నది. అనాలోచిత మానవ చర్యల వల్ల కలుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించాలన్న ప్రజలు, పాలకులు ఏకతాటిపై నడవాలి. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా సమాజంలో జరుగుతున్న చర్యల వల్ల భూగోళం అమితంగా వేడెక్కిపోతోంది. శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడటం వల్ల వాయుకాలుష్యం పెచ్చుమీరు తోంది.పట్టణాలు, నగరాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతోంది. వ్యవసాయంలో రసాయనాలు ఈ విచ్చలవిడిగా వాడుతూ పదికాలాల పాటు పదిలంగా చూసుకోవాల్సిన భూమిని నిస్సారంగా మారడం అనేక ప్రళయాలకు దారితీస్తాయని వాతావరణ నిపుణులుచెబుతున్నారు. దీనికితోడు రసాయనిక ఎరువులతో పెనుప్రమాదంగా మారింది. వ్యవసాయం కోసం విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు భూమిని నిస్సారంగా, నిర్జీవంగా మార్చేస్తున్నాయి.జీవం కోల్పోయిన నేలలో దిగుబడులూ నాసిగానే ఉంటాయి.. దీర్ఘకాలంలో దిగుబడులు మరీ తగ్గిపోయి ఆహార సంక్షోభాలకు దారితీసే ముప్పు పొంచిఉందని ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఆర్‌ ఆలివర్‌ డి షుట్టర్‌ గుర్తించారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ ఈ విధానాల వైపు మళ్లడం తప్ప మరో మార్గం లేదని నివేదించారు.
ప్రకృతి వనరులు, ఇంధనోత్పత్తి, వినియోగ నిర్ణయాల మీద పృథ్విర భవిష్యత్తు ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరనుందని అంచనా. వీరి అభివృద్ధి అవసరాలను తీర్చడానికి ఇప్పటికన్నా ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. ఇంధనాన్నీ అధికంగా ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధితోనే గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదల పెరుగుతూ, భూగోళ వాతావరణం వేడెక్కుతోంది. పృథ్వి సుస్థిర భవిష్యత్తు కోసం ఈ వాయువుల విడుదలను పరిమితం చేస్తూ, భూగోళ వాతావరణ క్షీణతను అరికట్టేందుకు ఇంతవరకూ చేపట్టిన కార్యక్రమాలు ఆశించినమేర ఫలితాల్ని ఇవ్వలేదు. పెరుగుతున్న జనాభా అవసరాల్ని తీరుస్తూ, భూగోళ సుస్థిరతను ఎలా కాపాడుకోవాలి? అనేది నేడు మనముందున్న ప్రధాన సవాల్‌. దీనికోసం హరిత సాంకేతికాలను, అభివృద్ధిని సాధించాలని ఓ బృహత్‌ ప్రణాళికను ఐక్యరాజ్యసమితి 2011లో ‘ప్రపంచ ఆర్థిక, సామాజిక సర్వే’ నివేదిక రూపంలో ముందుంచింది. సుస్థిర పర్యావరణాభివృద్ధికి దోహదపడేలా, పర్యావరణానికి ఇప్పటికే జరిగిన నష్టాన్ని పూడ్చేలా పునరుద్ధరణ కార్యక్రమాలను చేపడుతూ ఇప్పటి భవిష్యత్తు అవసరాలను తీర్చాలని ఈ నివేదిక సూచిస్తుంది.
మనమేం చేయాలి?
తరిగిపోయే వనరులకు బదులు, తరగని, పునర్వినియోగించుకోగల వనరుల ఆధారంగా జరిగే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి.ఇదే ధరిత్రికి సుస్థిర భవిష్యత్తును చేకూరుస్తుంది. ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ హరితార్థికా భివృద్ధికి, సుస్థిర భవిష్యత్తుకు మూలాధారం. భూమి, నీరు వంటి మౌలిక వనరులను గరిష్ట సామర్థ్యంతో వినియోగించాలి. చౌకైన, సమర్ధవంతమైన విద్యుత్‌, దూరదృష్టితో తరగని, పునర్వి నియోగించుకోగల వనరుల వినియోగాన్ని ప్రోత్సహించేలా ధరలను నిర్ణయించాలి. గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను కనీసస్థాయికి తగ్గించగల సాంకేతికాల వినియోగం చేయాలి.అడవుల సంరక్షణ, పునర్‌పెంపకం, సుస్థిర యాజమాన్య పద్ధతులు, జీవవైవిధ్య సంరక్షణ చేపట్టాలి.తోటి ప్రాణులకు ఆనందకరమైన బతుకును ఇవ్వాల్సిన మానవుడు, భూగోళాన్ని అతలాకుతలం చేయడం బాధాకరం. మానవాళి ి మనుగడకు ప్రధానమైన ధరిత్రిని నాశనం చేయడం, భూమి వేడేక్కడానికి కారణమైన గ్రీన్‌హౌస్‌ విషవాయువులను మోతాదుకు మించి విడుదల చేయడం, అంటే మనమెక్కి చెట్టుకొమ్మను మనమే నరుక్కోవడం. ఇకనైనా మేల్కొని భూగోళాన్ని ప్రాణ కోటికి ఉన్నసంబంధాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు, ప్రచారంతో ‘ధరిత్రీ ‘దినోత్సవ వేడుకలు, పర్యావరణ అవగా హనా కార్యక్రమాల ద్వారా పర్యావరణం మెరుగు దలకు కృషి చేయాలి. వ్యక్తి నుంచి అంతర్జాతీయ కార్పొరేషన్ల వరకూ అందరూ పర్యావరణ విద్య, పర్యావరణ విధానాలు, ప్రచారంపై దృష్టి సారిం చాలి. స్వచ్ఛమైన గాలి, నీరు పొందాలనుకుం టునట్లే మన బిడ్డలు, భావి తరాలు బాగుండాలనే మానవీయ కోణంలో ఆలోచించి ఈ భూగోళంపై నివసిస్తున్న ప్రతి మనిషి పర్యావరణ మిత్రులుగా మారినప్పుడే భూగోళం ఆరోగ్యంగా భాసిల్లుతుంది. ఈ రోజునుండైనా మనం మారుదాం.. తోటివారిని మారుద్దాం.. భూగోలాన్ని పునరుద్ధరిద్దాం.
గుండేటి యోగేశ్వర్‌

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు