కొమురంభీం జిల్లాలోని 339 గ్రామాలను మహారాష్ట్రలోని తడోబా అందరి కవ్వాల్ రిజర్వుతో అనుసంధానం చేస్తూ, కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటిస్తూ 30 మే 2025న రాష్ట్ర ప్రభుత్వం జీవో 49 తీసుకొచ్చింది ఈ జీవోలోని తొమ్మిదో పేరా చూస్తే అన్ని గ్రామాల్లో గ్రామసభలు జరిపినట్టు, ఫారెస్ట్ రెవెన్యూ ఇతర శాఖల అధికారులతో గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకున్నట్టు, అన్ని గ్రామాల ప్రజలు దీనికి ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఇది ఫారెస్ట్ శాఖ ఆడుతున్న పచ్చి అబద్ధం. ఎక్కడ గ్రామసభలు జరపలేదు, ప్రజాభిప్రాయం అంతకన్నా తీసుకోలేదు. గ్రామ సర్పంచులకు తెలియకుండానే నాలుగు గ్రామాల సర్పంచ్లను కమిటీలో పెట్టి ఆమోదం తెలిపారు.ఈ జీవో విడుదల తర్వాత ఆందోళనలో పాల్గొని దాని కాపీలను దగ్ధం చేసినవారిలో ఆ సర్పంచులే ఉండటం దీనికి సాక్ష్యం.
ఈ జీవో 49 పరిధిలోకి వచ్చే 339 గ్రామాలు, అందులోని రెండు లక్షల పైచిలుకు ఎకరాల భూమి పరిధి భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోనిది. భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఇక్కడ ఏ ప్రాజెక్టు చేపట్టాలన్న స్థానిక ఆదివాసీలను స్థానిక ప్రజల అభిప్రాయాలను స్థానిక గిరిజన చట్టాలను లోబడి చేపట్టాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. కానీ ఫారెస్ట్ శాఖ ఈ చట్టాలను గిరిజన హక్కులను పూర్తిగా విస్మరించింది ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని ప్రాంతంలోని గ్రామసభలు పీసా అటవీ హక్కుల చట్టం, 1/70 చట్టాలను పూర్తిగా నిర్వీ ర్యం చేసింది. ఈ జీవో అమలు నుండి గిరిజన గ్రామాలకు ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాలను ఫారెస్ట్ శాఖ అడ్డుపడుతోంది. రోడ్డు, అంగన్వాడీ భవనం, త్రీఫేస్ కరెంటు ఇందిరమ్మ ఇంటి పథకం కింద మంజూరైన ఇండ్ల నిర్మాణన్ని సైతం అడ్డుకుంటున్నది. గిరిజన సంక్షేమ శాఖ నుండి మంజూరైన గిరి వికాసం బోర్లను సైతం ఆపుతున్నది. ఈ జీవో కొమురం భీం జిల్లాలోని వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా ఉన్న వట్టివాగుపై ఉన్న కుమురంభీం ఆడ గ్రామ ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాజెక్టులను సైతం దీని పరిధిలోనికి తెచ్చింది. దీంతో ఈ జీవో పూర్తి స్థాయిలో జిల్లా అభివృద్ధికి ఆటంకంగా మారింది.
ఈ జీవో ప్రకటించినప్పటినుంచి ఆదివాసీ గిరిజన సంఘం, వామపక్షాల ఆధర్యంలో ఆందోళనలు చేపట్టాయి. కుమురం భీం జిల్లా వ్యాప్తంగా జూన్ 30న మండల, జిల్లా ఐటిడిఏ కార్యాలయాలను ముట్టడించాయి, వినతి పత్రాలు అందజేశాయి. ప్రజా సంఘాలు, ఆదివాసీ, సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు, ఎమ్మెల్యేలకు దరఖాస్తులిచ్చే కార్యక్రమాలు అమలు చేశాయి. రాష్ట్ర రాజధానిలోనూ ఉద్యమం ఊపందుకుంది. ఆదివాసీ సంఘాలు, వామపక్షాలు జులై 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్‌కి పిలుపునిచ్చాయి.ఈ బంద్ అన్ని వర్గాల ప్రజల భాగస్వా మ్యంతో విజయవంతమైంది. బంద్ సందర్బంగా వచ్చిన ప్రజా మద్దతును చూసి ప్రభుత్వం అదే రోజు సాయంత్రం జీవో 49ని తాత్కాలిక నిలుపుదల చేస్తూ మెమో నెంబర్ 3602 జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజా వ్యతిరేకత రాకుండా జనాగ్రహాన్ని చల్లార్చడానికి తాత్కాలిక నిలుపుదల చేసినట్టు కనిపిస్తున్నది. కానీ ఈ జీవోను పూర్తి స్థాయిలో రద్దు చేస్తేనే ఆదివాసీల పట్ల ఈ ప్రభుత్వం వైఖరేంటో తెలుస్తుంది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ పదకొండేండ్ల కాలంగా అడవుల అభివృద్ధి, గిరిజనుల గురించి ఉపన్యాసాలు దంచికొడుతోంది. కానీ అడవులనుంచి వెళ్లగొట్టే కుట్ర చాపకింద నీరులా సాగిస్తోంది. ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేయడం, అడవుల్లో నివసించే ఆదివాసీలను నిరాశ్రయులను చేయడం వంటి విధానాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశమంతటా ఉన్న అడవులను ప్రయివేట్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని చెబుతోంది. అస్సాం నుండి కేరళ వరకు ఇలాంటి టైగర్ కారిడర్, ఎలిపెంట్ కారిడర్ లాంటి పేర్లతో అడవుల నుండి ఆదివాసీలను తరిమేయడం, భూములను లాక్కోవడం, వారిని అడవి నరకివేత దారులుగా చూపడం వంటివి చేస్తోంది.
అడవులను కాపాడే పేరుతో వాటిని ప్రయివేటీకరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అడవుల్లో ఖనిజవనరుల వెలికితీత, దాన్ని వ్యాపారం చేసుకునేందుకు డైరెక్ట్‌గా ప్రధాన మంత్రి కార్యాలయమే అనుమతులిస్తోంది. రాజ్యాంగంలోని ఐదవ,ఆరవ షెడ్యూల్ ప్రాంత హక్కులు కాల రాయడం, గిరిజన హక్కులను నిర్వీర్యం చేయడం ఈ పదేండ్లలో పెరిగింది. ఉదాహరణకు ఛత్తీస్‌గఢ్‌లోని హస్ దే అనే అటవీ ప్రాంతం లోని నాలుగు లక్షల ఎకరాల అడవిని కార్పొరేట్లకు అప్పనంగా అప్పజెప్పింది. జార్ఖండ్‌లో బాక్సైట్ తవ్వకాలను, ఆంధ్రాలో హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరిట ఆదాని సంస్థ లాంటి కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి అడవుల విధ్వంసం చేస్తున్నది. ఆదివాసుల జీవన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. మళ్లీ గిరిజన అభివృద్ధి అంటూ మొసలి కన్నీరు కారుస్తోంది.
కేంద్రం విధానాలనే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు ఆచరణలో తేటతెల్లమవుతోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం చేత పట్టుకుని రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, హక్కుల గురించి చట్టసభలో మాట్లాడుతారు. కానీ తెలంగాణలో మాత్రం కేంద్రంలోని బీజేపీ అనుసరించే గిరిజన వ్యతిరేక విధానాలను ఆ పార్టీ నేతలు బలపరిచే విధంగా ముందుకు సాగడం బాధాకరం. అందుకే కేంద్రం చేపట్టిన అడవుల ప్రయివేటీకరణపై ముఖ్యమంత్రి తన వైఖరిని స్పష్టం చేయాలి. దేశ వ్యాప్తంగా నేషనల్ టైగర్ కంజర్వే షన్ రిజర్వ్ పేరుతో ఆదివాసీలను అడవులకు దూరం చేసే విధానాలకు వ్యతిరేకంగా నిలబడాలి. తెలంగాణలో జీవో 49 పూర్తిస్థాయిలో రద్దుచేసి ఫారెస్ట్ శాఖ అనుమతులు లేక ఆపేసిన ప్రభుత్వ పథకాలను పునరుద్ధరించాలి. ఇందిరమ్మ ఇండ్లు, త్రిపేజ్ కరెంట్, బోర్లు, రోడ్డు, వంటి వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. ఇలాంటి జీవోలను తాత్కాలికంగా నిలిపేయడం కాకుండా పూర్తి స్థాయిలో రద్దు చేసి గిరిజనుల పట్ల తమ పార్టీ చిత్త శుద్ధిని నిరూపించుకోవాలి.
పూసం సచిన్
6281128872
జీవో 49ని శాశ్వతంగా రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES