Tuesday, May 20, 2025
Homeప్రధాన వార్తలుప్రజల్లోకి వెళ్లండి

ప్రజల్లోకి వెళ్లండి

- Advertisement -

– విప్లవోద్యమ విజయానికి అదే నాంది
– విద్యార్థి, యువజనులకు భగత్‌సింగ్‌ ఇచ్చిన సందేశం అదే
– ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి హిందూత్వశక్తులు ఆయన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాయి
– భగత్‌సింగ్‌ వారసులు కమ్యూనిస్టులే : పుచ్చలపల్లి సుందరయ్య 40వ స్మారకోపన్యాసంలో ప్రొఫెసర్‌ చమన్‌లాల్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

”విద్యార్థి, యువజనులు ప్రజల్లోకి వెళ్లాలి. పొలాలు, కార్ఖానాల్లోకి వెళ్లి జీవితాల గురించి తెలుసుకోవాలి. సమస్యల పరిష్కారంపై వారిని చైతన్యవంతుల్ని చేయాలి. అప్పుడే విప్లవోద్యమ విజయానికి నాంది పడుతుంది” అని భగత్‌సింగ్‌ సందేశం ఇచ్చారని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), పంజాబ్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ చమన్‌లాల్‌ స్పష్టం చేశారు. కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సోమవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘భగత్‌సింగ్‌ ప్రాసంగికత-నేటి రాజకీయాలు’ అంశంపై జరిగిన సుందరయ్య 40వ స్మారకోపన్యాసంలో ప్రధాన వక్తగా చమన్‌లాల్‌ మాట్లాడారు. వందేండ్ల క్రితం మతోన్మాదంపై భగత్‌సింగ్‌ చెప్పిన మాటల్ని ఇప్పుడు బహిరంగంగా ఎందుకు చెప్పలేకపోతున్నామో ఆలోచించాలని సూచించారు. కరాచీ బేకరిపై దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతిమయాత్రలో పాకిస్తాన్‌ కవి రాసిన పాటను పాడారని గాయకుడిపై దాడి చేశారనీ, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకేముందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి హిందూ సంస్థలు ఇప్పుడు భగత్‌సింగ్‌ను కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. భగత్‌సింగ్‌ ముమ్మాటికీ కమ్యూనిస్టు నాయకుడేననీ, ఆయన బ్రతికిఉంటే గొప్ప అంతర్జాతీయ కమ్యూనిస్టు నేతగా ఎదిగి ఉండేవారని చెప్పారు. ఉరికంబం ఎక్కేముందు కూడా లెనిన్‌ రాసిన పుస్తకాన్ని చదివి, విప్లవకారులు లెనిన్‌ను చదవాలని సందేశం పంపారని తెలిపారు. లాటిన్‌ అమెరికా స్టార్‌గా చెగువేరా ఎదిగినట్టే, దక్షిణ ఆసియా విప్లవతారగా భగత్‌సింగ్‌ నిలిచారని చెప్పారు. భారతదేశం కులాల కుంపటిగా ఉన్నప్పుడే నవజీవన్‌ భారత్‌సభలో సామూహిక సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారని, జైలులో ఉన్నప్పుడు అక్కడి దళిత పారిశుధ్య కార్మికురాలిని ‘అమ్మా’ అని ఆప్యాయంగా పిలిచి, సంభాషించేవారనీ, ఆయనలోని సమిష్టి భావనకు ఇది ఉదాహరణ మాత్రమేనని వివరించారు. ఇది నేటి సమాజస్థితికి అత్యవసరమనీ, సమాజ దృష్టిని అర్థం చేసుకుంటూ దళితులు, స్త్రీ పురుషుల సమాన హక్కుల కోసం పోరాడాలని అన్నారు. రాజకీయవేదికలపై మతాలకు చెందిన ప్రార్థనా గీతాలు పాడొద్దని జవహర్‌లాల్‌ నెహ్రూ అప్పట్లోనే చెప్పారనీ, కానీ ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. భగత్‌సింగ్‌ అంటే భారతదేశంలో ఆరాధనాభావం ఉన్నదనీ, దక్షిణాదిరాష్ట్రాల్లో పూలే, పెరియార్‌, అంబేద్కర్‌తో పాటు భగత్‌సింగ్‌ చిత్రపటాలను పెట్టడాన్ని గమనించవచ్చనీ, కులదురహంకారాన్ని పోరాడి దూరం చేసుకోవాలే తప్ప, దేహీ అని యాచించడం సరికాదనేదే ఆయన అభీష్టమని అన్నారు. విద్యార్థులకు రాజకీయాలు అవసరమేననీ, విశ్వవిద్యాలయాలను రాజకీయరహితం చేయరాదని ఆయన గట్టిగా విశ్వసించేవారన్నారు. విప్లవం అంటే దోపిడీ నుంచి విముక్తిని ప్రసాదించే మానవ సమాజ సమూల మార్పు అని సంపూర్ణ విప్లవాత్మక అవగాహన ఉన్న వ్యక్తి భగత్‌సింగ్‌ అని కీర్తించారు. చరిత్ర తమను నిరపరాధులుగా గుర్తిస్తుందని ఫెడరల్‌ క్యాస్ట్రో చెప్పారనీ, భగత్‌సింగ్‌ కూడా తన చివరి ప్రసంగంలో అదే అంశాన్ని ప్రస్తావించారన్నారు. సిద్ధాంతపరంగా ఎన్ని విబేదాలు ఉన్నా, మహాత్మాగాంధీని గౌరవించాలని భగత్‌సింగ్‌ చెప్పేవారనీ, గాంధీ తన సందేశాన్ని ప్రజలకు చేరేవేసే పద్ధతి గురించి తెలుసుకోవాలని విశ్లేషించేవారని తెలిపారు. నిర్భీతి, నిర్భయత్వం గురించి భగత్‌సింగ్‌ నుంచే నేర్చుకోవాలన్నారు. బహుభాషాప్రావీణ్యం ఉన్న భగత్‌సింగ్‌ చిన్న వయసులోనే తన విప్లవసాహిత్యం ద్వారా యువతరానికి స్ఫూర్తిని ఇచ్చారనీ, దీన్ని స్వీకరించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని స్పష్టం చేశారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు బీవీ రాఘవులు మాట్లాడుతూ కులవ్యవస్థను ధ్వంసం చేయడాన్ని హక్కుగా లాక్కోవాలని భగత్‌సింగ్‌ దిశానిర్దేశం చేశారన్నారు. ప్రజలపై నమ్మకంతోనే ఆయన ఉరికంబాన్ని సులభంగా ఎక్కారని చెప్పారు. కమ్యూనిస్టులు శాంతికోసం యుద్ధం చేస్తారన్నారు. పాలస్తీనా, గాజాలో మారణహోమం అమెరికా పెత్తనం కోసం సాగుతున్నదేననీ, ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం నాటోదేశాలు, అమెరికా ఆధిపత్యం కోసం జరుగుతున్నవేనని విశ్లేషించారు. భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఓ మతానికి చెందినదిగా చూపుతూ, దాన్ని నేలమట్టం చేస్తామని చెప్పడం అవివేకమని అన్నారు. శాంతి కావాలి అని కోరే వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారనీ, యుద్ధాల తర్వాత మళ్లీ శాంతిచర్చలు అంటూ కమ్యూనిస్టుల బాటలోనే నేటి పాలకులు పయనిస్తున్నారని చెప్పారు. పెహల్గాం దాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని కోరితే తిరస్కరిస్తున్న కేంద్రం, అవే విషయాలను విదేశాల్లో ప్రచారం చేసేందుకు పార్లమెంటు సభ్యులతో కమిటీలు వేయడం విడ్డూరంగా ఉందన్నారు. విప్లవోద్యమ సవాళ్ల పరిష్కారసూత్రాలను ఆనాడే భగత్‌సింగ్‌ చెప్పారనీ, అవి నేటికీ ఆచరణీయమేనని విశ్లేషించారు.
కార్యక్రమంలో పాల్గొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ తాము చేపట్టిన కార్యక్రమాల నివేదికను సభకు వివరించారు. అంతకుముందు ఇటీవల మరణించిన సీపీఎం సీనియర్‌ నాయకులు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం కమిటీ మాజీ సభ్యులు రఘుపాల్‌, సాంబిరెడ్డి సతీమణి అరుణ, గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంలో మరణించిన వారు, పెహల్గాం మృతులకు సంతాపం తెలుపుతూ సభ మౌనం పాటించి నివాళులు అర్పించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి ప్రొఫెసర్‌ చమన్‌లాల్‌ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ సభ్యులు బుచ్చిరెడ్డి అతిధులను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -