నవతెలంగాణ – హైదరాబాద్: భారత స్టార్ బాక్సర్, తెలంగాణ తేజం నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో ఆమె స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు. 51 కేజీల విభాగంలో అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా నిఖత్‌పై రాజకీయ, క్రీడా ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నిఖత్ జరీన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై మరోసారి దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు. నిఖత్ అసాధారణ విజయం యువతకు, వర్ధమాన క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ, భారత బాక్సర్ల అపూర్వ విజయంతో దేశం గర్విస్తోందని అన్నారు. ముఖ్యంగా, తెలంగాణ బిడ్డ అయిన నిఖత్ జరీన్ తన అద్భుతమైన పంచ్‌లతో స్వర్ణం గెలవడంపై ప్రత్యేక అభినందనలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా నిఖత్‌ను ప్రశంసించారు. “నీ కఠోర శ్రమ, అలుపెరగని పట్టుదల భారత్‌కు, తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తున్నాయి. పెద్ద కలలు కనే ఎంతో మంది యువతులకు నువ్వు స్ఫూర్తి” అని కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. నిఖత్ అంకితభావం ప్రతి విజయంలో కనిపిస్తోందని కవిత కొనియాడారు.



