భగ్గుమన్న పసిడి
ఒకే రోజు రూ.9,700 ప్రియం
న్యూఢిల్లీ : బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఒక్క పూటలోనే రూ.9,700 పెరిగి.. మధ్యతరగతి ప్రజలు కూడా కొనలేని స్థాయికి ఎగిసింది. సోమవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారంపై రూ.9,700 ప్రియమై సరికొత్త రికార్డ్ స్థాయి రూ.1,30,300కు చేరింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి మారకం విలువ పడిపోవడానికి తోడు భౌగోళిక ఆందోళనలు, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ నేపథ్యంలో బంగారం సురక్షిత పెట్టుబడిగా పరిగణించడంతో ఈ లోహం ధర పెరుగుతోందని బులియన్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,600 వద్ద ముగిసింది. సోమవారం స్థానిక బులియన్ మార్కెట్లో 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.2,700 పెరిగి రూ.1,22,700 (అన్ని పన్నులతో సహా) రికార్డు స్థాయిని తాకింది. గత మార్కెట్ సెషన్‌లో ఇది రూ. 1,20,000 వద్ద ముగిసింది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడం బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నాడు బంగారం ధర నూతన రికార్డు స్థాయిని తాకిందని, ఈ రికార్డు ధరలో కూడా పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌లో సీనియర్ కమోడిటీస్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపవచ్చనే ఆందోళనలతో సురక్షిత ఆస్తిగా బంగారానికి డిమాండ్‌ను పెంచుతున్నాయని గాంధీ పేర్కొన్నారు.
ఈ ఏడాదిలో ఇప్పటివరకు బంగారం ధరలు రూ.51,350 లేదా 65.04 శాతం పెరిగాయి. 2024 డిసెంబర్ 31 నాడు 10 గ్రాముల బంగారం ధర రూ.78,950గా ఉంది. తాజాగా కిలో వెండి ధర రూ.7,400 పెరిగి రూ.1,57,400కి చేరింది. శుక్రవారం నాడు కిలో వెండి ధర రూ.1,50,000 వద్ద ముగిసింది. ఈ సంవత్సరంలో వెండి ధరలు రూ.67,700 లేదా 75.47 శాతం పెరిగాయి. 2024 డిసెంబర్ 31 కిలో వెండి ధర రూ.89,700గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ దాదాపు 2 శాతం పెరిగి ఔన్సు ధర 3,949.58 డాలర్లకు చేరి.. ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఆరవ రోజులోకి ప్రవేశించడంతో బంగారం, వెండి ధరలు ఎగిసిపడుతున్నాయని కోటక్ సెక్యూరిటీస్‌లో అండ్ కమోడిటీ రీసెర్చ్ అయిన కైనాత్ చైన్‌వాలా తెలిపారు.