నవతెలంగాణ-హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుండి హైదరాబాద్ వచ్చిన ఒక ప్రయాణికుడి వద్ద నుండి రూ. 1.55 కోట్ల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఈ బంగారం గురించి అందిన సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే, షార్జా నుండి వచ్చిన ప్రయాణికుడి లగేజీని అధికారులు పరిశీలించగా, ఒక ఐరన్ బాక్సులో దాచి ఉంచిన 11 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. దీంతో వెంటనే ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో స్మగ్లింగ్ ముఠాకు సంబంధించిన కీలక సంబంధాలు వెలుగుచూశాయి.
నిన్న రాత్రి ప్రొద్దుటూరులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన డీఆర్‌ఐ అధికారులు, అతను ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురిపై కస్టమ్స్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.



