మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుతో ప్రత్యేక చర్యలు
జిల్లాలో 2.20 కోట్ల చేప పిల్లల పంపిణీ
957 నీటి వనరులలో చేప పిల్లల విడుదల
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి
నవతెలంగాణ – వనపర్తి
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం పాటుపడి ఉందని, రానున్న రోజులన్ని మత్స్యకారులకు మంచి రోజులేనని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముదిరాజుల, మత్స్య సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. వనపర్తి పట్టణంలోని నల్లచెరువులో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేప పిల్లలను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్ద సామాజిక వర్గమైన ముదిరాజ్, మత్స్యకారుల, అభివృద్ధికై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చట్టం ద్వారా కార్పొరేషన్ స్థాపించి మత్స్యకారులకు ఋణాలు, సామగ్రి సరఫరా, మార్కెటింగ్ సహాయం లాంటి అనేక సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వనపర్తి జిల్లాలో మొత్తం రెండు కోట్ల 20 లక్షల చేప పిల్లలను 957 నీటి వనరులలో విడుదల చేయనున్నామని, ఈ మత్స్య సంపద ద్వారా మత్స్యకారుల ఉపాధి మెరుగు పడుతుందని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో అధికారులు ఎక్కడ ఎలాంటి పొరపాటు చేయకూడదని, గుర్తింపు ఉన్న ప్రతి నీటి వనరుకు ప్రభుత్వ ఉచిత చేప పిల్లల పంపిణీ జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి లక్ష్మప్ప, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్, వనపర్తి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మున్సిపల్ మాజీ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, పట్టణ మాజీ కౌన్సిలర్లు, మధ్య సహకార సంఘం నాయకులు నందిమల్ల చంద్రమౌళి, చుక్క రాజు, కిరణ్, మైనార్టీ నాయకులు రహీం, సమన్వయకర్త లక్కాకుల సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



