నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన అత్యంత నిరాశాజనకంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిన చెన్నై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. అయితే, వరుస ఓటములతో నిరాశలో ఉన్న అభిమానులకు ఊరటనిచ్చే రెండు కీలక వార్తలు వెలువడ్డాయి. గాయం కారణంగా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు.
కాలి పిక్క కండరాల గాయం నుంచి ధోనీ దాదాపు పూర్తిగా కోలుకున్నాడు. ఏప్రిల్ 14న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆయన తిరిగి మైదానంలోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఒకసారి ఫిట్నెస్ టెస్టులో పాల్గొన్న ధోనీ, మరో రెండు రోజుల్లో ఇంకో పరీక్షకు హాజరుకానున్నాడని సమాచారం. ధోనీ లేకపోవడంతో జట్టులో నాయకత్వ లోపం, అనుభవలేమి కొట్టొచ్చినట్టు కనిపించాయి. మరోవైపు, చెన్నై జట్టుకు మరో శుభవార్త అందింది. టోర్నీ ఆరంభానికి ముందు గాయపడిన దక్షిణాఫ్రికా యువ సంచలనం డెవాల్డ్ బ్రేవిస్ కూడా పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లోనే అతను బరిలోకి దిగనున్నాడు.



