నవతెలంగాణ – హైదరాబాద్ : వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయని గూగుల్ దాదాపు 11వేల యూట్యూబ్ ఛానళ్లను తొలగించింది. వీటిలో చైనా, రష్యాకు చెందిన ఛానళ్లు టాప్ లిస్టులో ఉన్నట్లు వెల్లడించింది. తొలగించిన వాటిలో కేవలం చైనాకు సంబంధించినవే 7,700 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నట్లు తెలిపింది. అవి భారత్‌లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయని.. రష్యాకు చెందిన 2,000లకు పైగా యూట్యూబ్ ఛానళ్లు, ఇతర వెబ్‌సైట్లను తొలగించినట్లు గూగుల్ వెల్లడించింది. ఈ ఖాతాల్లో ఉక్రెయిన్, నాటోలను విమర్శిస్తూ.. రష్యాకు మద్దతిచ్చేలా సందేశాలను వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. రష్యాలోని పలు సంస్థలకు కూడా ఈ ఛానళ్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిపింది. ఇటీవల గూగుల్ 20 యూట్యూబ్ ఛానెల్‌లు, నాలుగు ఖాతాలు, రష్యా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మీడియా సంస్థకు సంబంధించిన ఓ బ్లాగును తొలగించినట్లు వివరించింది.
చైనా, రష్యాలతో పాటు ఇరాన్, తుర్కియే, ఇజ్రాయెల్, రొమేనియా, అజర్‌బైజాన్, ఘనాకు చెందిన యూట్యూబ్ ఛానళ్లను కూడా తొలగించినట్లు గూగుల్ తెలిపింది. ఆయా దేశాలకు చెందిన యూట్యూబ్ ఛానళ్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అసత్య వార్తలు ప్రసారం చేస్తున్నందువల్ల వాటిని నిలువరించడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.