– ఏకగ్రీవ పంచాయితీలకు రూ.10 లక్షల నిధులు
– మద్ది కొండ పాలకవర్గం ప్రమాణస్వీకారం లో ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రజలు ఓటు ద్వారా ఇచ్చిన అవకాశాన్ని స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా సేవకే అంకితం చేయాలని, రాజ్యాంగ ప్రమాణానికి అనుగుణంగా పరిపాలన సాగించాలని జారె ఆదినారాయణ సర్పంచ్ లకు హితవు పలికారు. తెలంగాణ రెండో సాధారణ స్థానిక ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ లుగా ఎన్నికైన పాలకవర్గాల ప్రమాణస్వీకార కార్యక్రమంలో సోమవారం మండలంలోని మద్ది కొండ ఏకగ్రీవ పంచాయితీ పాలకవర్గం ప్రమాణస్వీకారం లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ నిధులను పంచాయితీలో బహుళ ప్రయోజనాలు కలిగిన అభివృద్ధి పనులకు వినియోగించాలన్నారు. అనంతరం నూతన సర్పంచ్ తాటి రామకృష్ణను సర్పంచ్ సీటులో కూర్చోబెట్టి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, ఎంపీఈఓ రామ కోటా రెడ్డి, సీఐ నాగరాజు రెడ్డి, ఎస్ఐ యయాతి రాజు, కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, తుమ్మ రాంబాబు, ప్రమోద్, కాసాని మురళి, పద్మ శేఖర్, కొల్లు నాగు తదితరులు పాల్గొన్నారు.



