Tuesday, May 13, 2025
Homeఆటలుప్రభుత్వ అనుమతే తరువాయి!

ప్రభుత్వ అనుమతే తరువాయి!

- Advertisement -

– 48 గంటల్లో రీ షెడ్యూల్‌కు అవకాశం
– ఐపీఎల్‌18 రీస్టార్ట్‌కు బీసీసీఐ సన్నద్ధత

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పున ప్రారంభంపై సందిగ్థత కొనసాగుతుంది. సరిహద్దు ఉద్రిక్తతలకు తెరదించుతూ భారత్‌, పాకిస్థాన్‌ కాల్పుల విరమణకు అంగీకరించగా.. ఐపీఎల్‌ 2025 సీజన్‌ను ముగించేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే రీ షెడ్యూల్‌ విడుదల చేసేందుకు బోర్డు రంగం సిద్ధం చేసుకుంది.
నవతెలంగాణ-ముంబయి

ఐపీఎల్‌ 2025 సీజన్‌ పున ప్రారంభం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతిపై ఆధారపడింది. భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ 18ను ఓ వారం పాటు వాయిదా వేస్తూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాల్పుల విరమణ అమల్లోకి రావటంతో ఐపీఎల్‌ 18వ సీజన్‌లో మిగిలిన 16 మ్యాచులను ముగించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రాంఛైజీలు, ప్రసారదారులు సహా రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో మాట్లాడుతున్న బీసీసీఐ వర్గాలు.. ఐపీఎల్‌18 పున ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. రానున్న 48 గంటల్లో అందరిని సంప్రదించి రీ షెడ్యూల్‌ వెల్లడించేందుకు బీసీసీఐ రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
సమయం ఉంది!
ఐపీఎల్‌18ను మే 9న వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. వారం రోజుల్లో లీగ్‌ పున ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. వాయిదా పడిన మరుసటి రోజే కాల్పుల విరమణ అంగీకారం కుదిరింది. దీంతో లీగ్‌ ప్రారంభంపై ఆటగాళ్లు, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రీ స్టార్ట్‌పై నిర్ణయం తీసుకోవడానికి బోర్డుకు మరింత సమయం ఉందని, అందరితో సంప్రదింపులు జరిపిన అనంతరం రీ షెడ్యూల్‌ ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్‌ సైకియా తెలిపారు. ‘ఐపీఎల్‌ను ఏడు రోజుల పాటు వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. రీ షెడ్యూల్‌, పున ప్రారంభంపై నిర్ణయానికి బోర్డుకు తగిన సమయం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తోంది. ఐపీఎల్‌ భాగస్వాములు సహా ప్రభుత్వ విభాగాలతో మాట్లాడుతున్నాం. ఆ తర్వాతే రీ స్టార్ట్‌పై నిర్ణయం ఉంటుంది’ అని దేవాజిత్‌ సైకియా అన్నారు. మరో 48 గంటల్లో ప్రాంఛైజీలు, ప్రసారదారులు, స్పాన్సర్లు, ఐపీఎల్‌ మ్యాచులకు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్ర క్రికెట్‌ సంఘాలతో మాట్లాడుతాం. ఐపీఎల్‌ను ఈ దశలో, ఈ పరిస్థితుల్లో పున ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం. ఈ ప్రక్రియ ముగిశాక ఐపీఎల్‌18 రీ స్టార్ట్‌పై బీసీసీఐ ప్రకటన చేస్తుందని దేవాజిత్‌ తెలిపారు.
12-14 రోజుల్లో ముగించాలని..
ఐపీఎల్‌18లో గ్రూప్‌ దశలో పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ నడుమ అర్థాంతరంగా రద్దుగా ముగిసిన పోరుతో సహా 58 మ్యాచులు ముగిశాయి. గ్రూప్‌ దశలో మరో 12 మ్యాచులు, ప్లే ఆఫ్స్‌లో నాలుగు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఒరిజినల్‌ షెడ్యూల్‌ ప్రకారం మే 25న ఫైనల్‌తో ఐపీఎల్‌ ముగియాలి. కానీ ఇప్పుడు 7-10 పది రోజుల విరామం రావటంతో ఫైనల్‌ మే ఆఖరు లేదా జూన్‌ తొలి వారానికి జరిగే అవకాశం ఉంది. జూన్‌ 11 నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడనుండగా.. ఈ నెలాఖరులోనే లీగ్‌ను ముగించాలని బోర్డు భావిస్తోంది. అందుకోసం మూడు నగరాల్లోనే, అవసరమైతే వీలైనన్ని డబుల్‌ హెడర్‌ మ్యాచులను షెడ్యూల్‌ చేయాలని యోచిస్తోంది. ప్లే ఆఫ్స్‌ మ్యాచులకు హైదరాబాద్‌, కోల్‌కతలను ఆతిథ్య నగరాలుగా కొనసాగిస్తూ.. గ్రూప్‌ దశ మ్యాచులను హైదరాబాద్‌, బెంగళూర్‌, చెన్నైలో నిర్వహించేందుకు ప్లాన్‌-బి సిద్ధం చేసింది. లీగ్‌ పున ప్రారంభమైన తర్వాత 12-14 రోజుల్లోనే ఫైనల్‌ను షెడ్యూల్‌ చేసేందుకు బీసీసీఐ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
విదేశీ క్రికెటర్లు వస్తారా?
ఐపీఎల్‌ 18 రీ స్టార్ట్‌ విదేశీ క్రికెటర్ల రాకపై ఆధారపడి ఉంటుంది. మెజార్టీ క్రికెటర్లు ఇప్పటికే స్వదేశం చేరుకోగా.. పలు ప్రాంఛైజీల సహాయక సిబ్బంది, విదేశీ క్రికెటర్లు భారత్‌లోనే లేదా మార్గంమధ్యలో ఉన్నారు. వారంలోగా లీగ్‌ మొదలైతే.. తిరిగి వస్తామని విదేశీ క్రికెటర్లు చెబుతున్నారని తెలిసింది. ద్వైపాక్షిక సిరీస్‌ బాధ్యతలతో విదేశీ క్రికెటర్లు మే దాటితే అందుబాటులో ఉండే అవకాశం లేదు. బీసీసీఐ నుంచి రీ స్టార్ట్‌, రీ షెడ్యూల్‌పై స్పష్టత లభిస్తే విదేశీ క్రికెటర్లను సంప్రదిస్తామని ప్రాంఛైజీ యాజమాన్యాలు చెబుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -