– ఎక్సైజ్‌శాఖ బాధ్యత వహించాలి
– బాధితులకు న్యాయం చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– నిమ్స్‌లో బాధితులకు పరామర్శ
నవతెలంగాణ-బంజారాహిల్స్
కల్తీ కల్లు తాగి ఇంతమంది ఆస్పత్రి బారిన పడటానికి ప్రభుత్వం, ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను గురువారం సీపీఐ(ఎం) నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఆస్పత్రికి రాకుండా ఇంకా చాలా మంది ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్నారని, ఆరుగురు మరణించారని తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల సిగాచి బ్లాస్ట్‌లో 40 మందికిపైగా ప్రాణం పోయిందని, ఇప్పుడు కల్తీ కల్లు వల్ల ఆరుగురు మృతిచెందారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది ప్రభుత్వ విధానాల వైఫల్యమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కొక్కరికీ ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు అమ్మకాలు చేస్తున్న వారు తాత్కాలికంగా శిక్షలు అనుభవించినా, కొన్నాళ్ల తర్వాత మళ్లీ అదే పని చేస్తున్నారని అన్నారు. ఇది పరంపరగా మారిపోయిందని, ఇటువంటి వ్యవస్థను ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి నిజమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజలకు ఎప్పటికీ న్యాయం జరగదని చెప్పారు.
అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెడుతూ గద్దెనెక్కిన ప్రభుత్వాలు వారి సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు మరింత పేదలుగా మారిపోవడానికి ప్రభుత్వాలే కారణమన్నారు. తమ పార్టీ సిద్ధాంతాలు ఎప్పుడూ కార్మిక కర్షక కూలీల పక్షానే ఉంటాయని, తాము పాలకులను ప్రశ్నిస్తుండటం వల్లే వారు మూడు పూటలా తినగలుగుతున్నారని, పని చేయగలుగుతున్నారని చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమలు చేసి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని, దీనిపై తాము ఎంతటి పోరాటమైనా చేసి హక్కులు సాధించుకుంటామని స్పష్టం చేశారు. బాధితులను పరామర్శించిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డిజి.నర్సింహారావు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి సత్యం, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీఐటీయూ నిమ్స్ నాయకులు వెంకటేశ్, మాధవి, గోపాస్ కిరణ్ తదితరులు ఉన్నారు.