– ఆలస్యమైనా హామీలను అమలు చేసి తీరుతాం..
– వాసాలమర్రిని దత్తత తీసుకుని ఆగం చేసిన కేసీఆర్ : గృహ నిర్మాణ, సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
– ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ
నవతెలంగాణ-తుర్కపల్లి
తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని, ఆలస్యమైనా ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని గృహ నిర్మాణ, సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో గురువారం ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. 227 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మాటల మాంత్రికుడు గత సీఎం కేసీఆర్ వాసాలమర్రిని దత్తత తీసుకొని ఆగం చేశారని విమర్శించారు. ఈనెల 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య వాసాలమర్రి విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారన్నారు.
గ్రామంలో పేదల చిరకాల కోరిక తీర్చడానికి ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి కల నెరవేర్చడం జరిగిందన్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన స్కూల్ భవనాలను, సీసీ రోడ్లను పూర్తి చేస్తామన్నారు. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ 8లక్షల 19వేల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చిందని, అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.6,500 కోట్లు మిత్తి కడుతోందని వివరించారు. ధరణి తీసుకొచ్చి రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఆగం చేసిందని, ప్రజలు ఆగం కావద్దని భూభారతి చట్టంతో అందరికీ పూర్తి భద్రత, న్యాయం చేయడానికి 2025 చట్టాన్ని తీసుకొచ్చినట్టు వివరించారు. పలు మండలాల్లో, జిల్లాల్లో 1000 మందికి పైగా సర్వేయర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పదేండ్లలో ఏ ఒక్కరికీ ఇల్లు నిర్మించలేదని విమర్శించారు. వాసాలమర్రికి కేసీఆర్ చేసిన గాయానికి సీఎం రేవంత్‌రెడ్డి మందు పెడుతున్నారని చెప్పారు. మూఢనమ్మకాల పిచ్చోడు చేసిన పనికి గ్రామమంతా బలైపోయిందన్నారు. నాలుగు నెలల్లో ఇండ్లను పూర్తి చేసుకోవాలన్నారు. వాసాలమర్రి గ్రామానికి 227 ఇండ్లను ప్రత్యేకంగా మంజూరు చేశారన్నారు. ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మెన్ బండ్రు శోభారాణి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, మదర్ డెయిరీ చైర్మెన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ అయినాల చైతన్య మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్‌రెడ్డి, తహసీల్దార్ దేశ్యనాయక్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
ఇండ్లను పరిశీలించిన మంత్రి
భువనగిరి మండలంలోని బండ సోమవారం గ్రామంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఇండ్లను త్వరితగతిన పూర్తిచేసిన లబ్దిదారులకు నూతన వస్త్రాలు, వంటగ్యాస్ స్టవ్‌లు పంపిణీ చేశారు.