- రికార్డు స్థాయిలో ఆరు పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత
- 577 మార్కులతో ప్రథమ స్థానంలో నిలచిన ఇద్దరు విద్యార్థులు
- కేజీబీవీ లో వరుసగా ఐదోసారి వందశాతం ఉత్తీర్ణత
నవతెలంగాణ – పెద్దవంగర
పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కారు పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఔరా అనిపించారు. మండలంలోని పెద్దవంగర, చిట్యాల, బొమ్మకల్, అవుతాపురం, జెడ్పీ ఉన్నత పాఠశాలలతో పాటుగా, కేజీబీవీ, ఎంజేపీ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. వడ్డెకొత్తపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 9 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 8 మంది పాసయ్యారు. కేజీబీవీ విద్యార్థులు 2020 నుండి వరుసగా వంద శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. మండలంలో మొత్తం 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 274 మంది ఉత్తీర్ణులయ్యారు. పెద్దవంగర జెడ్పీ పాఠశాల విద్యార్థి కన్నె మేఘన 577 మార్కులు, చిట్యాల జెడ్పీ పాఠశాల విద్యార్థి రాపోలు లుకేష్ 577 మార్కులతో ప్రథమ స్థానం, ఎంజేపీ విద్యార్థి జి. జెశ్వంత్ 576 మార్కులతో ద్వితీయ స్థానం, పెద్దవంగర విద్యార్థులు ఎం. శ్రీవల్లి, ఎండీ అఫ్సర్ 574 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచినట్లు ఎంఈవో బుధారపు శ్రీనివాస్ తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎంఈవో అభినందనలు తెలిపారు.
- Advertisement -