నవతెలంగాణ-హైదరాబాద్: విలీనం పేరుతో ఉత్తరప్రదేశ్ లో యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం భారీ ఎత్తున పాఠశాలలను మూసివేస్తోంది. ఇప్పటి వరకూ 5 వేలకు పైగా పాఠశాలకు తాళం వేసింది. దీనికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఉత్తరప్రదేశ్ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. అలాగే జిల్లాలోని విద్యా శాఖ ప్రధాన కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించింది. అక్కడి అధికారులకు ముఖ్యమంత్రి పేరు మీదగా మెమోరాండంలను అందచేశారు.
లక్నోలో జరిగిన నిరసన ప్రదర్శనలో సీపీఐ(ఎం) ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ మిశ్రా పాల్గొన్నారు. విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారనే పేరుతో యోగి ప్రభుత్వం పాఠశాలల విలీనానికి పాల్పడుతోంది. 50 కంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్న అన్ని పాఠశాలలను మూసివేయాలని ప్రాథమిక విద్యా శాఖ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాఠశాలల మూసివేతతో 6 నుంచి 14 ఏళ్ల వయస్సు గల పిల్లలకు ఉచిత, నిర్భంధ విద్యను దూరం చేయడమేనని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. పాఠశాలల మూసివేత కారణంగా మధ్యహ్న భోజన పథకం కార్మికుల సేవలు కూడా ముగుస్తాయని చెప్పారు. భవిష్యత్‌లో ఉపాధ్యాయ నియమాకాలు కూడా జరగవని విమర్శించారు.