నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండలం రాజపూర్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్త మాతంగి భాగ్యలక్ష్మి (40) బుధవారం గుండెపోటుతో మరణించారు. పని ఒత్తిడి వల్లే ఆమె మరణించినట్లు ఆశా వర్కర్స్ యూనియన్ ఆరోపించింది. గత 20 సంవత్సరాలుగా ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తగా సేవలందిస్తున్న భాగ్యలక్ష్మికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీలత ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆశా కార్యకర్తలు మరణిస్తే రూ. 50 వేలు అంత్యక్రియల ఖర్చులకు, రూ. 50 లక్షల బీమాను అందిస్తామని ఆరోగ్య శాఖ కమిషనర్ హామీ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. అయితే, ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఎటువంటి జీవోనూ ప్రభుత్వం విడుదల చేయలేదని శ్రీలత ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆశా వర్కర్లు అనారోగ్యాలు, ప్రమాదాలతో మృత్యువాత పడుతున్నారు,అని శ్రీలత అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఆశా వర్కర్లతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాయని, వారికి న్యాయం చేయడం లేదని ఆమె విమర్శించారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలను సైతం లెక్కచేయకుండా 20 సంవత్సరాలుగా నిస్వార్థ సేవలు అందిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం మరణించిన భాగ్యలక్ష్మి కుటుంబాన్ని ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఆర్థిక సహాయం అందించాలని శ్రీలత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు రామగిరి రాజమణి, లలిత, అనసూయ, స్వరూప, జహేద, లక్ష్మి, సులోచన, సుజాత తదితరులు పాల్గొన్నారు.