ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి
నవతెలంగాణ- కరీంనగర్ :
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వరి ధాన్యం కోతలు మొదలై 25 రోజులు గడుస్తున్నా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని, వెంటనే కొనుగోలు సెంటర్లు ప్రారంభించి కొనుగోల్లు వేగవంతం చేయాలని, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు.  శుక్రవారం రోజున ముకుందలాల్ మిశ్రా భవన్లో ఆయన మాట్లాడుతూ ధాన్యం పంట చేతికొచ్చి 25 రోజులు గడుస్తున్నా, కొనే దిక్కు లేక తక్కువ ధరకు ప్రైవేట్గా రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్కు 200 నుండి 250 రూపాయలు నష్టపోతున్నారని, ఎకరానికి 6 నుండి 8000 నష్టపోతున్నారని అన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క ధాన్యం కొనుగోలు సెంటర్ను కూడా ప్రారంభించకపోవడం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ0,అధికార యంత్రాంగానికి ఉన్న  చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవైపు వాతావరణశాఖ పక్క రాష్ట్రానికి వర్ష సూచన చెబుతుందని వెంటనే అధికార యంత్రాంగం జిల్లాలో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు కనీస సౌకర్యాలైన గన్ని సంచులు, సుతిలి, మంచినీటి సౌకర్యం, టెంట్లు వేయాలని అన్నారు. అకాల వర్షాలకు దాన్యం దెబ్బతినకుండా టార్పాలిన్లు ఇవ్వాలని సూచించారు. అన్నదాతల రక్తాన్ని జలగల్లా పిలుస్తున్న రైస్ మిల్లర్లపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. నాణ్యత ప్రమాణాల పేరుతో 40 కిలోల దాన్యం బస్తాకు నాలుగు కిలోల నుండి 8 కిలోల వరకు గతంలో కోతపెట్టారని ఈసారి అలాంటి కొర్రీలు, కోతలు లేకుండా కొనుగోల్లు సజావుగా జరిగే విధంగా జిల్లా అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే సెంటర్లను గుర్తించి రైసు మిల్లలతో అగ్రిమెంట్లు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో అన్నదాతలు నిలువు దోపిడికి గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల రైతాంగాన్ని  ఐక్యం చేసి జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి, గిట్ల ముకుంద రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు యు. శ్రీనివాస్, డి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love