– బస్తాలు, లారీల కొరత లేకుండా చూడాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి
– ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం పరిశీలన
నవతెలంగాణ-ఆత్మకూరు(ఎస్)
ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని శనివారం సీపీఐ(ఎం) నేతలతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ఐకెేపీ కేంద్రాల్లో నెల రోజుల నుంచి ధాన్యం రాశులు పోసి కాంటాల కోసం రైతులు ఎదురుచూస్తున్నా.. కాంటాలు వేసే పరిస్థితి లేదన్నారు. వాతావరణంలో వస్తున్న మార్పుల మూలంగా అకాల వర్షాలు పడి చేతికొచ్చిన పంట తడిసి ముద్దయితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఐకేపీ కేంద్రాల్లో కాంటాలు వేయడంలో జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉందన్నారు. గన్నీ బ్యాగులు సప్లై చేయాలని జిల్లా స్థాయి అధికారులను అడిగితే ఐకేపీ కేంద్రాలకు సరిపడా బస్తాలు ఉన్నాయని, ముందస్తుగానే సరఫరా చేస్తున్నామని చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతన లేదని విమర్శించారు. ఐకేపీ కేంద్రంలో గన్నీ బ్యాగుల కొరత, లారీల కేటాయింపు లేక కాంటాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంటాలు వేసిన ధాన్యం మిల్లు దగ్గరికి వెళితే అన్‌లోడింగ్‌కు వారం రోజులు పడుతుండటంతో రైతుల బాధ వర్ణణాతీతంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం లోడు దిగుమతి చేసుకునేటప్పుడు మిల్లర్లు కొర్రీలు పెడుతూ తరుగు పేరుతో రైతులకు నష్టం కలగజేస్తున్నారని వివరించారు. మిల్లుల, లారీల కేటాయింపు, బస్తాల సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట గోపి, రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండావెంకటరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జె.నర్సింహారావు, మండల కార్యదర్శి అవిరే అప్పయ్య, నాయకులు మూల విజయరెడ్డి, గోలి భాగ్యమ్మ, రేణిగుంట్ల రవి, రైతులు కాసర్ల మల్లారెడ్డి, బ్రహ్మచారి, మదనాచారి, కొడిదల శ్రీను పాల్గొన్నారు.
సత్వరమే చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES