Tuesday, October 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభారీ వర్షానికి తడిసిన ధాన్యం

భారీ వర్షానికి తడిసిన ధాన్యం

- Advertisement -

– వలిగొండలో ఇండ్లలోకి చేరిన నీరు
నవతెలంగాణ-భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం భారీ వర్షం కురవడంతో పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద పోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పంట పొలాల్లోకి, ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది. మూసీ పొంగిపొర్లుతోంది. మూసీ పరివాహక ప్రాంతంలో రాకపోకలు బంద్‌ అయ్యాయి. వలిగొండ మండలంలో కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వలిగొండ, భువనగిరి, రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్‌, మోత్కూరు, బీబీనగర్‌, మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది.

ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సమావేశాలు, సూచనలకే పరిమితమైంది. నేటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ముందస్తుగా పంట చేతికొచ్చిన చోట ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోశారు. 17 శాతం తేమ ఉండేందుకు ధాన్యాన్ని ఆరుబోసుకున్నారు. వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం వచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఆదివారం ఉదయం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు తప్ప జిల్లాలో కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పలేదు. ఈ క్రమంలో భారీ వర్షం పడటంతో ధాన్యం మొత్తం తడిసిముద్దయింది. రైతులు లబోదిబోమం టున్నారు. రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో ఐకేపీ సెంటర్‌ ప్రారంభించలేదు. వరి కోతలు కోసిన రైతులు తమ ధాన్యాన్ని తెచ్చి మార్కెట్‌లో రాసులు పోశారు. తేమ తగ్గడం కోసం ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి భారీ వర్షం కురియడంతో ఆరబోసిన ధాన్యమంతా తడిసింది. వరదనీటిలో కొట్టుకుపోయింది. అనేక మంది రైతుల ధాన్యం కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టం ఏర్పడింది. గత వారం కూడా వర్షం పడడంతో ధాన్యం తడిసిపోయింది. ఎండబెట్టిన ధాన్యం రెండో సారి తడిసిపోయింది. వలిగొండ, చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, మండలాల్లోని పలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
వర్షం కారణంగా నష్టపోయిన పంటలను అధికారులు వెంటనే పరిశీలించి పరిహారం చెల్లించాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. వర్షాల వల్ల వరదనీరంతా రామన్నపేట, వలిగొండ, సంస్థాన్‌ నారాయణపురం, చౌటుప్పల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చింది. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలి. ఐకేపీ కేంద్రాలన్నీ ఆరుబయటే నిర్వహిస్తున్నారు. అన్ని కేంద్రాల్లోనూ గ్రామీణ గోదాములు, షెడ్లను నిర్మించాలి. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఆటోమేటిక్‌ డ్రయ్యర్స్‌ను సరఫరా చేయాలి. తడిసి రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలి.
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -