Tuesday, April 29, 2025
Homeదర్వాజమహా ప్రస్థానం స్ఫూర్తితోనే.. శూన్యం..!

మహా ప్రస్థానం స్ఫూర్తితోనే.. శూన్యం..!

”నిప్పులు చిమ్ముకుంటూ/ నింగికి నే నెగిరిపోతే/ నిబిడాశ్చర్యంతో వీరు-/ నెత్తురు క్రక్కుకుంటూ/ నేలకు నేరాలిపోతే/ నిర్దాక్షిణ్యంగా వీరే…”
దాదాపు రెండు దశాబ్దాలుగా ఉపాధ్యాయుడిగా,అధ్యాపకుడిగా ఎన్నో వేదికల మీదుగా విద్యార్థులనుద్దేశించి ఇలాంటి శ్రీశ్రీ మహాప్రస్థానపు విస్పోటనపు ఆలోచనలను నా ఉపన్యాసాల్లో ఉపయోగిస్తూనే వున్నాను.పై గేయం నా పిల్లలు(యూకేజీ – మూడవ తరగతి)కూడా కంఠతా చెబుతారు. నన్ను విపరీతంగా ప్రభావితం చేసిన తెలుగు, ఇంగ్లీష్‌ మాధ్యమ ఎన్నో వివిధ రకాల పుస్తకాల్లో శ్రీశ్రీ మహాప్రస్థానం ఒకటని కొంచెం సగర్వంగానే ప్రకటిస్తున్నాను. ఎంతలా అంటే నా మొదటి కవిత్వం పుస్తకం ‘శూన్యం’ మహాప్రస్థానం స్ఫూర్తితోనే రాశాను. నేడు నా పుస్తకం సామాన్య పాఠకులు మొదలు ఎంతోమంది సాహితీ ప్రముఖుల నుంచి వస్తున్న స్పందనల ప్రస్థానంలోని అభినందనల మాలతో నేను శ్రీశ్రీకి ఇస్తున్న అక్షర నివాళులు ఇవే.
నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో పరిచయమైన మహాప్రస్థానపు ప్రవాహం నా మెదడు శూన్యంలో అనంతంగానే ప్రభావితం చేస్తూనే వుంది. నేను డిగ్రీ విద్యార్థులకు పాఠాలు చెప్పే సందర్భంలో కూడా ఆ గేయాలు నవసమాజాన్ని ప్రతిబింబిస్తూనే వున్నాయి. దశాబ్దాలుగా అజ్ఞానం, అసమానత, అన్యాయం, వివక్షత వంటి ఎన్నో సామాజిక రుగ్మతలపై మహాప్రస్థానం పెద్ద యుద్ధమే చేస్తుంది. ”ఒకటి మాత్రం నిశ్చయం 1933లో ‘నేను సైతం ప్రపంచాగ్నికి’ ఇత్యాది గీతంతో ప్రారంభించి కడసారిగా గ్రాంథిక శైలికీ, గణ బద్ధ చ్ఛందస్సులకీ గుడ్‌ బై కొట్టేశాను. ఇదే గురజాడ అడుగుజాడ” అంటూ శ్రీశ్రీ చెప్పిన మాటలే నాలాంటి సామాన్యులు కూడా సమాజ పోకడలపై కవిత్వం రాసేలా చేసింది. ముఖ్యంగా శాస్త్రీయ దక్పథంతో సత్యపు పునాదులపై ఆయన తన అక్షరపు ఆలోచనల సౌధాన్ని నిర్మించడం వలనే తరాలు మారినా ఆ ప్రస్థానపు వెలుగు జ్వాలల వేడి వాడి తగ్గడం లేదు.
”నేనొక దుర్గం! నాదొక స్వర్గం!/ అనర్గళం, అనితరసాధ్యం నా మార్గం”
”1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది.ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు ఈ శతాబ్దం నాది” అంటూ తన అక్షర ప్రభావ ప్రస్థానపు ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు శ్రీశ్రీ. ప్రపంచం ఆర్థికమాంద్యంతో తల్లడిల్లి ఆకలితో అలుమటిస్తున్న 1930-1940 మధ్యకాలంలో సామాన్యుల వ్యథలను నవీనత్వంతో వ్యక్తపరుస్తూ, సామాజిక వాస్తవికతకు దర్పణం పట్టేలా రాసిన శ్రీశ్రీ మహాప్రస్థానం గేయాలు 1950లో పుస్తకరూపం దాల్చాయి. ఆ పుస్తక ప్రభ,అందులోని కవిత్వపు శోభ 75 వసంతాలైన ఇంకా నేటి ఆధునిక ప్రపంచానికి రిలవెంట్‌గానే వుంది. యాదచ్ఛికంగా మహాప్రస్థానపు 75 వసంతాల వేళ నా మొదటి కవిత్వపుస్తకం రావడం నా జీవితంలోనే ఓ అద్భుతంగా భావిస్తున్నాను. నేటికీ శ్రీ పేరు మీద ఎన్నో సామాజిక, సాహిత్య స్వచ్చంద సంస్థలు నవసమాజ నిర్మాణం కోసం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తూనే వుండటమే అందుకు తార్కాణం. ఓ ప్రముఖ పత్రిక వారు ఈ మధ్యనే ఆంగ్ల మాధ్యమంలో చదివి సాప్ట్‌వేర్‌ రంగంలో రాణిస్తున్న వారికి నచ్చిన టాప్‌ -2 తెలుగు కవిత్వపు పుస్తకాలు ఏంటని సర్వే నిర్వహించగా శ్రీశ్రీ మహాప్రస్థానం ఒకటని తేలింది.
తెలుగు సాహిత్యపు వెలుగును విశ్వ వ్యాప్తం చేసిన శ్రీశ్రీ మహాప్రస్థానంను ఈవేళ మళ్ళీ పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో పరిచయం చేస్తూ, నేటి సమాజంలో ఆ ఆలోచనల అక్షరాల శంఖారావాన్ని వినిపించాలి. కొత్తగా రాయించాలి. కొన్ని బహుమతులతో విద్యార్థుల్ని ప్రోత్సహించాలి. పుట్టినరోజులు, జాతీయ పండుగల సందర్భంగా మహాప్రస్థానం పుస్తకాలను గిఫ్ట్స్‌గా అందించాలి. ఆ మహాకవి ఆశయాల క్షిపణులను భావితరపు బ్రతుకు వినీలాకాశంలోకి స్వేచ్ఛ, సమానత్వపు ఇంధనాలతో దూసుకెళ్ళేలా మనమంతా బాధ్యత వహిద్దాం. తెలుగు పాటకు జాతీయ స్థాయి అవార్డు అందించిన ఆయన మార్గంలోనే నేను సైతం కదులుతూ… కదిలిస్తూ… ముందుకే వెళ్తూ..
”ప్రపంచమొక పద్మవ్యూహం! కవిత్వమొక తీరని దాహం!” అంటూ ఏనాటికీ తీరని నా ‘ఫిజిక్స్‌’ దాహంతో శూన్యపు తొలి అడుగుల ప్రకాశపు సాక్షిగా విశ్వ సాహితీ ప్రయాణం కొనసాగిస్తూనే వుంటాను. నాకు స్ఫూర్తినిచ్చిన పుస్తకం గురించి చెప్పడానికి 75 వసంతాల మహాప్రస్థానపు సంబరాల్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన నవతెలంగాణ దినపత్రిక వారికి ధన్యవాదాలతో…నమస్కారం!
– ఫిజిక్స్‌ అరుణ్‌ కుమార్‌, 9394749536

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img