Sunday, August 10, 2025
E-PAPER
spot_img
Homeకవర్ స్టోరీ'కిరాణా' మరణయాతన...

‘కిరాణా’ మరణయాతన…

- Advertisement -

చిప్స్‌ ప్యాకెట్‌, చాక్లెట్‌ నుంచి మొదలుకుని ఏ వస్తువు కావాలన్నా అనేక మంది ఆన్‌లైన్‌ సేల్స్‌ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇటివల మార్కెట్లోకి వచ్చిన క్విక్‌ కామర్స్‌ సంస్థలు జెప్టో, బ్లింకిట్‌ వంటి కంపెనీలు 10 నిమిషాల్లోనే వారి గిడ్డంగుల నుంచి ఆయా వస్తువులను కస్టమర్ల ఇంటికి తెచ్చి డెలివరీ చేస్తున్నాయి. దీంతో అనేక మంది ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేందుకు ఇష్టపడుతున్నారు. దీనికి తోడు పలురకాల ఆఫర్ల పేరుతో కస్టమర్లకు తక్కువ ధరకు ఉత్పత్తులను ఇస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా నగరాల్లోని జనాలు వీటివైపే చూస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌ విక్రయాల ప్రభావం కాస్తా సూపర్‌మార్కెట్లు, కిరాణా షాపులపై పడింది. దీంతో గత కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా దాదాపు రెండు లక్షల కిరాణా షాపులు మూతపడ్డాయి.
ఇంట్లో ఉండి సెల్‌ మీట నొక్కితే చాలు ఏది కావాలన్నా ఇంటి గుమ్మం ముందుకి రావాల్సిందే. ఐదు రూపాయల చిప్స్‌ ప్యాకెట్‌ నుంచి బియ్యం బస్తా వరకు అన్ని ఒక్క క్లిక్‌తో ఇంటికి వస్తున్నాయి. దీనికి తోడు భారీ ఆఫర్లతో ఊరిస్తూ సిటీలో అన్నిమూలలకూ సేవలను విస్తరిస్తున్నాయి. దీంతో గల్లీలోని కిరాణా దుకాణానికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. క్విక్‌ కామర్స్‌ దెబ్బకు చిన్నపాటి కిరాణా దుకాణాలు పత్తా లేకుండా పోయాయి. తక్కువ సమయంలో హోం డెలివరీ, ఆఫర్లు, కావాల్సిన వస్తువులు ఇలా అన్నీ ఉండడంతో కస్టమర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఏఐసీపీడీఎఫ్‌ పేర్కొంది. ఇలానే కొనసాగితే కిరాణా షాపులు అనే పదం పుస్తకాల్లో మాత్రమే కనిపిస్తుందని మధ్య, దిగువ తరగతి వ్యాపారులు వాపోతున్నారు.
కరోనా మహమ్మారి దెబ్బకు వినియోగదారుల వైఖరిలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మాల్స్‌ కంటే సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్‌ వాటాను క్విక్‌ కామర్స్‌ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఇదివరకు ఎడాపెడా ఏది పడితే అది కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు మారిన ఆర్థిక పరిస్థితులతో అలా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్‌ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ తమ నివేదికలో తెలిపింది.
క్విక్‌ కామర్స్‌ విభాగం వేగంగా విస్తరిస్తోంది. 2024లో ఈ మార్కెట్‌ 6.1 బిలియన్‌ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ దాదాపు 1.28 బిలియన్‌ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు.. మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్‌ కామర్స్‌ మాధ్యమం సౌకర్య వంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్‌ కామర్స్‌ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ.400గా ఉంటోంది. ఆన్‌లైన్లో నిత్యావసరాలను షాపింగ్‌ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్‌లో నిత్యావసరాల కొనుగోళ్లను పావుభాగం తగ్గించుకుని, దాన్ని క్విక్‌ కామర్స్‌ వైపు మళ్లించారు.
సాంప్రదాయ రిటైల్‌ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్‌ కామర్స్‌ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటంతో కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్‌ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్‌ కామర్స్‌ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వద్ధి నమోదు చేయనుంది. 2023-28 మధ్యలో 48% వార్షిక వద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది’ అని నివేదిక పేర్కొంది.
క్విక్‌… ‘కిక్‌’..
10-30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్‌ కామర్స్‌ వ్యవహరిస్తుంది. ఈ విభాగంలో బ్లింకిట్‌, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, ఫ్లిప్‌కార్ట్‌ మినిట్స్‌ మొదలైనవి టాప్లో ఉన్నాయి. షాపింగ్‌ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్‌ కామర్స్‌ సంస్థలు ప్రధానంగా దష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్‌ కామర్స్‌ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్‌, దుస్తులు, కాస్మెటిక్స్‌, గహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా క్విక్‌ కామర్స్‌ కంపెనీల హవా జోరుగా సాగుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న 1.3 కోట్ల స్టోర్లు క్విక్‌ కామర్స్‌ వల్ల ప్రభావితమయ్యే అంశాల గురించి ఏఐసీపీడీఎఫ్‌ సమీక్ష నిర్వహించింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని కిరాణా స్టోర్లపై క్విక్‌ కామర్స్‌ ప్రభావం ఎక్కువగా ఉందని పరిశ్రమల సంఘం తెలిపింది. మూతపడిన రెండు లక్షల స్టోర్లలో 45 శాతం మెట్రోల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత టైర్‌-1 నగరాల్లో 30 శాతం, టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో 25 శాతం దుకాణాలు కనుమరుగయ్యాయి. దాదాపు 3.3 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న క్విక్‌ కామర్స్‌ రంగం మెట్రోల్‌ మార్కెట్‌ పైనే ఎక్కువ దష్టి సారిస్తోంది.
క్విక్‌ కామర్స్‌ కంపెనీలు విస్తరిస్తున్న వేగానికి దశాబ్దాలుగా భారత రిటైల్‌ రంగానికి వెన్నెముకగా ఉన్న కిరాణా స్టోర్ల కస్టమర్‌ బేస్‌, లాభదాయకతను దెబ్బతీస్తున్నాయన్నారు. అంతేకాకుండా అధిక డిస్కౌంట్లు, తక్కువ ప్రైసింగ్‌ వంటి అంశాల్లో అన్యాయమైన విధానాలను క్విక్‌ కామర్స్‌ కంపెనీలు అనుసరిస్తున్నాయని పరిశ్రమల సంఘం నివేదిక పేర్కొంది.
క్విక్‌ ఫుడ్‌ డెలివరీ విభాగంలో ఇటువంటి సంస్థలు తమ సేవల్ని విస్తరిస్తున్నాయి. 10 మినిట్స్‌ డెలివరీలు అందిస్తూ ఈ విభాగంలో ఉన్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుంటున్నాయి. అంతేకాదు మార్కెట్లో తమ వాటా పెంచుకునేందుకు ఈ విభాగంలో పెట్టుబడుల్ని పెంచుతున్నాయి. విస్తరణ దశలో భాగంగా దిల్లీ- ఎన్‌సీఆర్‌, బెంగళూరు, ముంబయిలో 100కు పైగా కిచెన్‌లను ‘బిస్ట్రో’ నడుపుతోంది.
ఒకప్పుడు ఆన్‌లైన్‌ ద్వారా ఏదైనా వస్తువు ఆర్డర్‌ చేస్తే వచ్చేందుకు రోజులు పట్టేది. క్విక్‌ డెలివరీలు అంటూ నిమిషాల వ్యవధిలోనే ఇంటికి వస్తున్నాయి. కిరాణా వస్తువుల నుంచి దుస్తులు, ఎలక్ట్రిక్‌ గాడ్జెట్స్‌ వంటివి క్విక్‌ కామర్స్‌లోకి వచ్చేశాయి. ఇప్పుడు అర్బన్‌ కంపెనీ అదే దారిని ఎంచుకుంది. ఇంటి పని కోసం 15 నిమిషాల్లో వర్కర్లను పంపిస్తామని తెలిపింది. ఇందుకోసం తాజాగా యూపీ ఇన్‌స్టా మెయిడ్‌ సేవలకు శ్రీకారం చుట్టింది.
జెప్టో 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తోంది. దీంతో అనేక కంపెనీలు ఈ సేవల్లో అడుగు పెడుతున్నాయి. ల్యాప్‌మేట్‌, స్నాబిట్‌, జింగ్‌, స్విష్‌, ఫస్ట్‌క్లబ్‌ వంటి స్టార్టప్‌ సంస్థలు ఆయా సిటీల్లో క్విక్‌కామర్స్‌ సేవలు అందిస్తున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 300 మిలియన్‌ డాలర్లుగా ఉన్న క్విక్‌ గ్రాసరీ డెలివరీల మార్కెట్‌ విలువ 2025 నాటికి 7.1 బిలియన్‌ డాలర్లకు చేరడమే అందుకు నిదర్శనం. బ్లూ వెంచర్స్‌ నివేదిక ప్రకారం 2031 ఆర్థిక ఏడాది నాటికి ఈ విలువ 89 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.
ఏఐసీపీడీఎఫ్‌నివేదిక ప్రకారం మెట్రోలలో నెలవారీ సగటు టర్నోవర్‌ రూ. 5.5 లక్షలతో 17 లక్షల దుకాణాలు ఉన్నాయి. వాటిలో 45% మూతపడ్డాయట. సగటు నెలవారీ టర్నోవర్‌ రూ. 3.5 లక్షలతో 12 లక్షల దుకాణాలు ఉన్న టైర్‌-1 నగరాల్లో 30% దుకాణాలు మూతపడగా, టైర్‌-2 నగరాల్లో 25% షాపులు బంద్‌ అయ్యాయట. దేశంలో మొత్తం 1.3 కోట్ల కిరాణా షాపులున్నాయి. వీటిలో టైర్‌ 1 నగరాల్లో అంటే పెద్ద నగరాల్లో 12 లక్షల దుకాణాలు ఉండగా, టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో కోటి కిరాణా షాపులున్నాయి.
వినియోగదారులకు నేరుగా ఇంటికే సరుకులు అందించేందుకు ఇప్పుడు అన్ని సంస్థలూ సన్నద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. మోర్‌, డీమార్ట్‌ లాంటి సూపర్‌ మార్కెట్లు సైతం ఇప్పుడు హోం డెలివరీ సేవలకు ప్రాముఖ్యం ఇస్తున్నాయి. బిగ్‌ బాస్కెట్‌, బ్లింకిట్‌, జెప్టో, ఇన్‌ స్టా మార్ట్‌ లాంటి కంపెనీల సంగతి తెలిసిందే. జియో మార్ట్‌ తన క్విక్‌ డెలివరీ సేవలను విస్తరిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఈ రంగంలో వస్తున్నది. ఇక ఆన్‌లైన్‌ షాపింగ్‌లో విప్లవం తెచ్చిన అమెజాన్‌ ‘తేజ్‌’ పేరుతో వచ్చే ఏడాది త్వరతి సేవలను అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. వీటన్నిటి ప్రభావం వినియోగదారుల మీదా, స్థానిక దుకాణాల మీదా, కార్మికుల మీదా ఎలా ఉండబోతుందన్నది బాధ కలిగించే విషయం.
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా ఎనలిటిక్స్‌ వంటి సాంకేతికతల దన్నుతో కస్టమర్ల ఆర్డర్‌ ధోరణులు, ప్రొడక్ట్‌ ప్రాధాన్యతలు, ఏ సమయంలో ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారనే అంశాలను అధ్యయనం చేయడం, డార్క్‌ స్టోర్‌ నుంచి గమ్యస్థానికి అత్యంత వేగవంతమైన మార్గం ఎంచుకోవడం వంటివన్నీ చకచకా చక్కబెట్టేస్తున్నాయి. జెప్టో వంటి కీలక క్విక్‌ కామ్‌ సంస్థలు ఉపయోగిస్తున్న తెరవెనుక (బ్యాకెండ్‌) టెక్నాలజీ, ఏకకాలంలో పికర్స్‌, ప్యాకర్స్‌, ఇంకా రైడర్లను రియల్‌టైమ్‌లో కనెక్ట్‌ చేస్తోంది. ఒకసారి యాప్‌లో ఆర్డర్‌ కన్ఫర్మ్‌ అవ్వగానే, ఈ సిస్టమ్‌కి అందరూ అనుసంధానమైపోతారు. ఆర్డర్‌ను పిక్‌ చేయడం, డిస్పాచ్‌ చేయడం 2 నిమిషాల్లోపే జరిగిపోతుంది.
ఆపై ట్రాఫిక్‌, ఇంధన మైలేజీ, వాహన టెలీమెట్రీ, ప్రయాణ సమయాల చరిత్ర, దూరం వంటి డేటాను ఉపయోగించుకుని రియల్‌ టైమ్‌ రూటింగ్‌ తగిన రూట్లను సూచిస్తుంది. దీనివల్ల ఆర్డర్‌ను డెలివరీ పార్టనర్‌ ఎంత సమయంలో కస్టమర్‌ చెంతకు చేర్చగలరనే అంచనా ట్రావెల్‌ టైమ్‌ (ఈటీఏ)ను పక్కాగా పేర్కొంటుంది. సగటున 8 నిమిషాల్లోపే ఆర్డర్‌ డెలివరీ జరిగేందుకు వీలవుతోందని నిపుణులు చెబుతున్నారు. 340కి పైగా డార్క్‌ స్టోర్లున్న జెప్టో గతేడాది డెలివరీ దూరం 1.7 కిలోమీటర్లు కాగా, ఇప్పుడిది 1.5 కిలోమీటర్లకు తగ్గించుకుంది.
3-4 సెకెన్లలో చెకవుట్‌ అయ్యే విధంగా అధునాతన టెక్నాలజీలు వినియోగించే పేమెంట్‌ గేట్వే సర్వీసులను కంపెనీ వాడుకుంటోంది. ఇక బీబీనౌ విషయానికొస్తే, ఆర్డర్‌ ఏ డార్క్‌ స్టోర్‌కు వెళ్తుందో నిర్ణయించడానికి ముందే టెక్నాలజీ రంగంలోకి దిగుతుంది. ఉదాహరణకు సదరు ప్రాంతంలో ఉన్న రైల్వే ట్రాక్‌లు, పీక్‌, నాన్‌-పీక్‌ టైమ్‌లో ట్రాఫిక్‌, రోడ్డు స్థితిగతులు, ఇప్పటిదాకా కస్టమర్‌ షాపింగ్‌ ధోరణులు, వయస్సు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ వంటి పలు డేటా పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటుంది.
రిటైలర్లకు నష్టం కలగకుండా, క్విక్‌ కామర్స్‌ సంస్థలు అంగీకరించేలా సమన్వయం చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేయాల్సి ఉంది. రిటైల్‌ వ్యవస్థలో భాగస్వాములందరి ప్రయోజనాలను పరిరక్షిస్తూనే సజనాత్మకతకు మద్దతు ఇచ్చేలా పరిష్కారాలు కనుగొనాలి.
– తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
8008 577 834

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img