– ఏప్రిల్‌లో రూ.2.37 లక్షల కోట్లు
– ప్రభుత్వాలకు ఆల్‌టైం రికార్డ్ రాబడి
– తెలంగాణలోనూ పెరుగుదల
న్యూఢిల్లీ: దేశంలో రికార్డ్ స్థాయిలో అమాంతం పెరిగిన పన్ను వసూళ్లు ప్రభుత్వ ఖజానాను నింపివేస్తున్నాయి. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.2.37 లక్షల కోట్ల మార్క్‌ను చేరినట్టు గురువారం కేంద్ర ప్రభుత్వం గణంకాలను వెల్లడించింది. గతేడాది ఇదే నెల వసూళ్లతో పోల్చితే 12.6 శాతం పెరుగుదల నమోదయ్యిందని తెలిపింది. దీంతో ప్రజలపై అమలు చేస్తోన్న హెచ్చు పన్నులు సర్కార్ ఖజానాను గలగలలాడేలా చేస్తోన్నాయని స్పష్టమవుతోంది. 2024 ఇదే ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లయ్యింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజాగా ఆ రికార్డు ఈ ఏడాది తుడుచుకుపెట్టు కుపోయింది. జీఎస్టీ విధానాన్ని 2017 జులై నుంచి అమల్లోకి తెచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లలో ఏప్రిల్ 2025 నిలిచిందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. తొలి సారి రూ.92వేల కోట్లతో ప్రారంభమైన జీఎస్టీ వసూళ్లతో పోల్చితే.. ఆరేళ్లలోనే రెండున్నర రెట్ల మేర పెరగడం విశేషం. ఈ ఏడాది మార్చిలో రూ.1.96 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లయ్యింది. గడిచిన ఏప్రిల్ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీలు 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లకు చేరాయి. దిగుమతైన వస్తువులపె జీఎస్టీ ఆదాయం 20.8 శాతం వృద్ధితో రూ.46,913 కోట్లకు పెరిగింది. ూ.27,341 కోట్ల రిఫండ్లు జారీ అనంతరం నికర జీఎస్టీ వసూళు రూ.2.09 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయి. 2018 ఏప్రిల్‌లో తొలిసారి జీఎస్టీ వసూళ్లు రూ.1లక్ష కోట్లు దాటాయి. తొలిసారి 2024 ఏప్రిల్‌లో పన్ను వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మార్కు దాటింది.
తెలుగు రాష్ట్రాల్లో…
ఏప్రిల్ 2025లో తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ పన్ను వసూళ్లు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో తగ్గగా.. తెలంగాణలో జీఎస్టీ రాబడి పెరిగింది. తెలంగాణలో 12 శాతం వృద్ధితో రూ.6,983 కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. గతేడాది ఇదే ఏప్రిల్‌లో రూ.6,236 కోట్లుగా నమోదయ్యాయి. కాగా.. గడిచిన నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు 3 శాతం తగ్గి రూ.4,686 కోట్లకు పరిమితమయ్యాయి. 2024 ఇదే నెలలో ఏపీలో రూ.4,850 కోట్ల జీఎస్టీ వసూళ్లయ్యింది.
కండ్లు చెదిరే జీఎస్టీ వసూళ్లు
- Advertisement -
RELATED ARTICLES