నవతెలంగాణ-హైదరాబాద్: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై అల్లరిమూకల చేష్టలు శృతిమించుతున్నాయి. ఆ దేశంలో నెలకొన్న రాజకీయల అనిశ్చితి కారణంగా మైనార్టీలైన హిందువులపై దాడులు నిత్యకృత్యమవుతున్నాయి. ఇటీవలె మైనార్టీలైనా ఇద్దరి హిందువులను హత్య చేసిన ఉదంతం మరువక ముందే తాజాగా మరో వ్యక్తిని బలితీసుకున్నారు.
డిసెంబర్ 18న భాలుకాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను ఓ గుంపు కొట్టి చంపిన విషయం తెలిసిందే. అంతకుముందు, ఓ హిందూ వ్యక్తి కూడా హత్యకు గురయ్యాడు. మైమెన్‌సింగ్ జిల్లాలోని ఓ వస్త్ర కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హిందూ కార్మికుడిని సహోద్యోగి కాల్చి చంపాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 6:45 గంటల సమయంలో మెహ్రాబారి ప్రాంతంలో ఉన్న లాబిబ్ గ్రూప్ ఫ్యాక్టరీ అయిన సుల్తానా స్వెటర్స్ లిమిటెడ్‌లో చోటు చేసుకుంది.
బుల్లెట్ గాయమైన బజేంద్రను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం రెండు వారాల్లో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. ఇలా వరుస దాడులతో బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.



