భవనాలు ఖాళీ చేయాలంటున్న యజమానులు
రూ.215 కోట్లకు చేరిన బకాయిలు
10 నెలలుగా పైసా విదల్చని ప్రభుత్వం
ఎప్పుడు తాళాలు వేస్తారోనని
విద్యార్థుల ఆందోళన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో అద్దె బకాయిల అంశం గుబులు పుట్టిస్తోంది. దాదాపు పది నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం అద్దెలు చెల్లించకపోవడంతో భవనాలు ఖాళీ చేయాలంటూ యజమానులు ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు అద్దెకు సంబంధించిన ఒప్పందం గడువు ముగియడంతో తమ భవనాలు తక్షణమే ఖాళీ చేయాలని ఇప్పటికే 63 గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లకు వారు ఖరాఖండిగా తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో గురుకుల సంస్థల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రభుత్వ బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోవటంతో పాటు ప్రయివేటుకు ఇచ్చుకుంటే నెలా నెలా ఠంఛనుగా అద్దె వసూలు చేసుకోవచ్చని యజమానులు భావిస్తున్నట్టు తెలిసింది. మైనారిటీ గురుకులాల్లోనూ అద్దెలు ఏడాదికిపైగా పెండింగ్‌లోనే ఉన్నాయి.
అద్దె లేదు.. నిర్వహణ భారం
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని భవనాల యజమానులు ఎక్కువగా గురుకుల పాఠశాలలను ఖాళీ చేయాలని అధికారులకు స్పష్టం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని భవనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో అద్దె సక్రమంగా రాని గురుకుల పాఠశాలలకు బదులుగా ఇతర ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలకు వాటిని కిరాయికిస్తే.. బాడుగ నెలవారీగా వస్తుందనీ, పైగా ఎక్కువ మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశముందనే ఆలోచనతో యజమానులు తమ భవనాలు ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాళ్లపై ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు ఏటా అద్దె పెంపు సైతం నిలిచిపోవడం కూడా ఇందుకు మరో కారణంగా కనిపిస్తోంది.
ఇంకోవైపు భవనాలకు రెగ్యులర్ రిపేర్లు, కొన్ని గురుకులాల్లో తాగునీరు, ఇతర అవసరాలకు నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చి సరఫరా చేయాల్సి ఉండటంతో యజమానులకు అది ఇబ్బందికరంగా మారుతోంది. నెలవారీ అద్దెబిల్లు రాకపోగా.. ప్రతినెలా సొంతంగా ఖర్చులు భరించాల్సి రావడంతో వాటిని ఖాళీ చేయించడమే ఉత్తమమని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు భవనాల యజమానులు భావిస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికల్లా(జూన్ మొదటి వారం) భవనాలను ఖాళీ చేయాలని ఇప్పటికే ప్రిన్స్‌పాళ్లకు స్పష్టం చేశారు. కొంతమంది యజమానులు ఇప్పటికే భవనాల గేట్లకు తాళాలు వేసినట్టు క్షేత్రస్థాయి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
అద్దె భవనాల్లో 662 గురుకులాలు
ప్రస్తుతం గురుకులాల అద్దె బకాయిలు రూ.215 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. కాగా యజమానులు గురుకుల సొసైటీలపై ఒత్తిడి చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం పైసా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలోనే యజమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఐదు ప్రభుత్వ గురుకుల సొసైటీలున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నాలుగు గురుకుల సొసైటీలుండగా..విద్యాశాఖ పరిధిలో జనరల్ గురుకుల సొసైటీ ఉంది. వీటి పరిధిలో 1,023 గురుకుల పాఠశాలలు, కళాశాలలున్నాయి. ఇందులో 662 విద్యా సంస్థలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి నెలకు సుమారు రూ.20 కోట్ల మేర అద్దె రూపంలో చెల్లించాల్సి ఉంది. అయితే గత 10 నెలలుగా అద్దె బిల్లులను ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో మొత్తం బకాయిలు రూ.215 కోట్లకు చేరాయి. వీటిని విడుదల చేయాలంటూ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నా ఫలితం లేదని యజమానులు చెబుతున్నారు.