నవతెలంగాణ-హైదరాబాద్: బెంగళూరులోని త్యాగరాజనగర్‌లో రోడ్డుపై ఆడుకుంటున్న ఓ చిన్నారులపై రంజన్ అనే జిమ్ ట్రైనర్ విచక్షణారహితంగా దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఓ బాలుడిని కాలితో బలంగా తన్నడంతో అతని శరీరం, చేతులపై గాయాలయ్యాయి. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు బనశంకరి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, ఆ తర్వాత స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నిందితుడు రంజన్ గతంలోనూ ఆ ప్రాంతంలోని పలువురు చిన్నారులపై ఇలాగే దాడులకు పాల్పడినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది. ఉద్దేశపూర్వకంగానే పిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నట్లు దశ్యాల ద్వారా తెలుస్తోంది. పోలీసులు నిందితుడిపై సెక్షన్ బీఎన్‌ఏ 115/2 కింద కేసు నమోదు చేశారు.
బాలల హక్కుల కమిషన్ సీరియస్.. నివేదికకు ఆదేశం
ఈ ఘటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. కమిషన్ అధ్యక్షుడు శశిధర్ కొసాంబే మాట్లాడుతూ, పిల్లలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవించే హక్కు ఉందని, వారిపై ఇలాంటి దాడులు మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కమిషన్‌లో ఫిర్యాదు నమోదు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.



